భారతదేశంలో ఎన్ని ప్రాంతాలు ఉన్నాయో అన్ని ప్రాంతాల ప్రజలు నివసించే ఏకైక నియోజకవర్గం మల్కాజ్‌గిరి అన్నారు కాంగ్రెస్ నేత, ఎంపీ రేవంత్ రెడ్డి. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎంపీలకు కార్యకర్తలు మంగళవారం గాంధీభవన్‌లో సన్మానం చేశారు.

అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్, హరీశ్‌లు కొడంగల్‌లో కుట్రలు చేసి, అధికారాన్ని దుర్వినియోగం చేసి తనను ఓడించారన్నారు. అక్కడ తనను ఓడించినప్పటికీ.. ప్రజలు కేసీఆర్‌కు గుణపాఠం చెప్పడానికే తనను మల్కాజ్‌గిరిలో గెలిపించారని రేవంత్ తెలిపారు.

మల్కాజ్‌గిరి నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 3.18 లక్షల మెజారిటీ ఉందని.. అయినప్పటికీ తనను 11 వేల మెజారిటీతో గెలిపించారన్నారు. ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యమవుతుందని ప్రజలు భావించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్‌తోనే కాకుండా మోడీ, అమిత్‌షాలపైనా తాము పోరాటం చేస్తామన్నారు.