ఈ ఏడాది చివర్లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు సాధించడం ఖాయమని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తం చేసారు.
నల్గొండ : ఈ ఏడాది చివర్లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటక ఫలితాలే రిపీట్ కానున్నాయని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తం చేసారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి సిద్దంగా వున్నారని... కాంగ్రెస్ కు 70 నుండి 80 సీట్లు వస్తాయన్నారు. ఒకవేళ కాంగ్రెస్ కు 70 సీట్లు రాకుంటే రాజీనామా చేస్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఛాలెంజ్ చేసారు.
మంగళవారం కోమటిరెడ్డి పుట్టినరోజు వేడుకలు నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్ట్ వద్ద జరిగాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఆయన కేక్ కట్ చేసారు. అనంతరం కోమటిరెడ్డి మాట్లాడుతూ... తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం బలంగా వుందన్నారు. గతంలో మాదిరిగా పార్టీలో వర్గపోరు లేదని... నాయకులమంతా కలిసి పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువస్తామన్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జోస్యం చెప్పారు. తాను కూడా నల్గొండ అసెంబ్లీ నుండి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుస్తానని పేర్కొన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ కాంగ్రెస్ బలంగా వుందన్నారు వెంకట్ రెడ్డి.
Read More త్వరలోనే యాత్ర చేస్తా: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ఇక తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడంపై అదిష్టానం దృష్టిపెట్టిందని కోమటిరెడ్డి అన్నారు. ఈ నెల 26న తెలంగాణ ముఖ్య నాయకులతో కాంగ్రెస్ జాతీయాధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కీలక నాయకులు రాహుల్ గాంధీ సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారని అన్నారు. అలాగే మరోసారి ప్రియాంక గాంధీని తెలంగాణకు తీసుకువచ్చి నల్గొండలో భారీ బహిరంగ సభ ఏర్పాటుచేస్తామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
ఇక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవిని ఆశించనని... అదే తనను వెతుక్కుంటూ వస్తుందని కోమటిరెడ్డి అన్నారు. త్వరలోనే తాను పాదయాత్ర చేపట్టనున్నట్లు ఎంపీ కోమటిరెడ్డి స్పష్టం చేసారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇప్పటికే ప్రకటించిన యూత్, రైతు డిక్లరేషన్లు అమలు చేస్తామని కోమటిరెడ్డి ప్రకటించారు.
