తెలంగాణ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కరోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తున్నా కేసీఆర్ ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు
తెలంగాణ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కరోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తున్నా కేసీఆర్ ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఈ మేరకు కేసీఆర్‌కు ఆయన ఆదివారం లేఖ రాశారు. రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఎందుకు తక్కువ చేసి చూపిస్తున్నారని కోమటిరెడ్డి ప్రశ్నించారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వారి ప్రైమరీ కాంటాక్టులకూ టెస్టులు చేయాల్సిన సర్కార్ ఎందుకు చేయడం లేదని ఎంపీ నిలదీశారు.
Also Read:లాక్‌డౌన్, కర్ఫ్యూ విధించే అవకాశం లేదు, కరోనా కట్టడిలోనే ఉంది: ఈటల
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి క్రమంగా పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడం లేదని.. ప్రజారోగ్య వ్యవస్థను పూర్తిగా గాలికి వదిలేశారని వెంకటరెడ్డి విమర్శించారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చుతామని అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటన ఏమైందని కోమటిరెడ్డి ప్రశ్నించారు.
రాష్ట్రంలో కొవిడ్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున రాష్ట్ర ప్రజలందరికీ చికిత్స అందుబాటులో ఉండేలా ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకలు సరిపోకపోవడంతో బాధితులు కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేరుతూ లక్షలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఉందని ఆయన స్పష్టం చేశారు. పేద ప్రజలకు కరోనా చికిత్స అందక ఇబ్బందులు పడితే మాత్రం కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని కోమటిరెడ్డి హెచ్చరించారు.
