భువనగిరి : స్థానిక సంస్థలకు నిధులు కేటాయించాలంటూ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేపట్టిన రాస్తారోకో ఉద్రిక్తత పరిస్థితికి దారితీసింది. ఉద్రిక్తతలో ఓ సర్పంచ్ కాలు విరిగిపోగా పలువురు కార్యకర్తలు స్వల్పగాయాల పాలయ్యారు. 

సర్పంచ్ ల అధికారాలను కాపాడాలని జాయింట్ చెక్ పవర్ రద్దు చేయాలని కోమటిరెడ్డి డిమాండ్ చేస్తూ భువనగిరి జడ్పీ కార్యాలయం వద్ద స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆందోళనకు దిగారు. 

ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిరసన కార్యక్రమానికి అనుమతులు లేవంటూ పోలీసులు అడ్డుకున్నారు. కోమటిరెడ్డిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఆయన అరెస్ట్ ను అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. 

దాంతో పోలీసులు, కోమటిరెడ్డి వర్గీయులు, కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో వరపర్తి సర్పంచ్, మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు ఎలిమినేటి కృష్ణారెడ్డి కాలు విరిగిపోయింది. కొంతమంది కార్యకర్తలు స్వల్ప గాయాలపాలయ్యారు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఎంపీ కోమటిరెడ్డిని అరెస్ట్ చేసి భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు.