తనకు పదవులు అక్కర్లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఫార్మా కంపెనీలకు భూములిచ్చిన రైతులకు అండగా వుంటామని ఆయన స్పష్టం చేశారు.  

కాంగ్రెస్ (congress) సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (komatireddy venkat reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు పదవులు అక్కర్లేదని.. కొత్తతరం నాయకులను ప్రోత్సహిస్తామని ఆయన పేర్కొన్నారు. ఫార్మాసిటీలో (pharma city) భూములు కోల్పోయిన రైతులకు అండగా వుంటామని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. ఫార్మా కంపెనీలకు భూమి ఎంతకు అమ్ముతున్నారో.. భూములిచ్చిన రైతుకి అంత డబ్బు ఇవ్వాలని వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన కోరారు. 

ఇకపోతే... గత మంగళవారం రేవంత్ రెడ్డితో (revanth reddy) కలిసి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తాను చనిపోయినప్పుడు మూడు రంగుల జెండా కప్పమని చెప్పానన్నారు. నాది ఒకే మాట, ఒకే బాట అని ఆయన స్పష్టం చేశారు. ప్రధానికి కేసీఆర్ (kcr) అవినీతిపై పూర్తి వివరాలతో ఫిర్యాదు చేశానని కోమటిరెడ్డి అన్నారు. అభివృద్ధి కోసం తాను పోరాడుతానని.. బొగ్గు గనుల కుంభకోణంపై కేసీఆర్ సమాధానం చెప్పాలని వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో తనపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. యూపీఏ హయాంలో జరిగిన కోల్ స్కామ్ కంటే ఇది ఇంకా పెద్దదన్నారు. 

నైనీ కోల్ మైన్ కాదని.. నైనీ గోల్డ్ మైన్ అంటూ కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీతో (bjp) అవగాహన లేకుండా సింగరేణి (singareni) సీఎండీని ఎనిమిదేళ్ల పాటు ఎలా కొనసాగిస్తారంటూ కోమటిరెడ్డి ప్రశ్నించారు. దీనిపై చీఫ్ సెక్రటరీ సైతం హైకోర్టును ఆశ్రయించారని ఆయన తెలిపారు. శ్రీధర్ అయితేనే ఇలాంటి స్కామ్‌లు చేయగలుగుతారంటూ కేసీఆర్ ఆయనను కొనసాగిస్తున్నారంటూ కోమటిరెడ్డి ఆరోపించారు. కేసీఆర్ (kcr) పాలనలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని.. కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చినవి తప్ప రాష్ట్రంలో కొత్తవి లేవంటూ దుయ్యబట్టారు. రైస్ లేని రాష్ట్రాలకు బియ్యంను అమ్ముకోవచ్చని.. లేదంటే తెల్లరేషన్ కార్డు దారులకు అదనంగా బియ్యంను ఇవ్వొచ్చని కోమటిరెడ్డి పేర్కొన్నారు. 

వీటికి డబ్బులు లేవని.. సెక్రటేరియట్‌, ప్రగతి భవన్ కట్టడానికి మాత్రం డబ్బులు వున్నాయా అంటూ వెంకట్ రెడ్డి ఫైరయ్యారు. ఫాంహౌస్‌ చుట్టూ రింగ్ రోడ్డు కట్టించారంటూ ఆరోపించారు. 15 మందికి చెక్కులు ఇచ్చి దళిత బంధును వదిలేశారని మండిపడ్డారు. ఆలేరులో కార్యక్రమం జరిగినప్పుడు తనను పిలవలేదని కోమటిరెడ్డి ఫైరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఆలేరు, భువనగిరిలలో వున్న ఒక్క ఎకరాకు కూడా నీళ్లు అందడం లేదని ఆయన ఆరోపించారు.