Asianet News TeluguAsianet News Telugu

సోనియా గాంధీ అపాయింట్‌మెంట్ కోరిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అపాయిట్‌మెంట్ కోరారు.  తనపై జరుగుతున్న ప్రచారాన్ని సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిర్ణయం తీసుకన్నారు.

Congress MP Komatireddy Venkat Reddy Seeks Sonia Gandhi Appointment
Author
First Published Aug 18, 2022, 1:41 PM IST

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అపాయిట్‌మెంట్ కోరారు.  తనపై జరుగుతున్న ప్రచారాన్ని సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిర్ణయం తీసుకన్నారు.  ఈ క్రమంలోనే పార్టీలో జరుగుతున్న పరిణామాలను నేరుగా సోనియాకు వివరించే ఉద్దేశంతో కోమటిరెడ్డి  వెంకట్ రెడ్డి అపాయింట్‌మెంట్ కోరారు. అయితే ఇటీవల కరోనా పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో సోనియా గాంధీ.. ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం కోమటిరెడ్డికి అపాయింట్‌మెంట్ దొరకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది. ‌ 

ఇటీవల కాంగ్రెస్‌ను వీడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా రేవంత్ చేసిన హోంగార్డు వ్యాఖ్యలు అత్యంత బాధ కలిగించిందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ఉన్న ఇతర సీనియర్లు కూడా హోం గార్డులేనని ప్రశ్నించారు. తనను పార్టీ నుండి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అలాగే చండూరు సభలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌పై చర్యలు తీసుకోని పీసీసీ నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను దూషించిన వారిని పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. అద్దంకి దయాకర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు ఈ విషయమై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా క్షమాపణ చెప్పాలన్నారు.

ఈ క్రమంలోనే దిగొచ్చిన రేవంత్ రెడ్డి.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బేషరుతగా బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. పత్రికా సమావేశంలో హోంగార్డ్ ప్రస్తావన, చండూరులో జరిగిన కాంగ్రెస్ సభలో వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పారు. ఈ మేరకు రేంత్ రెడ్డి ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. చండూరు సభలో అద్దంకి దయాకర్ వ్యాఖ్యలు సరికాదని అన్నారు. ‘‘కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఉద్దేశించి అద్దంకి దయాకర్ పరుషమైన పదజాలం వాడటంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. పీసీసీ అధ్యక్షుడిగా నన్ను సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో నేను బేషరతుగా క్షమాపణ చెబుతున్నాను. ఇలాంటి చర్య, భాష ఎవరికీ మంచిది కాదు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని అవమానించేలా ఇలా మాట్లాడటం తగదు. తదుపరి చర్యల కోసం క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డికి సూచన చేయడం జరుగుతుంది’’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.  

దీంతో ఈ వివాదం కాసింత చక్కబడుతుందని కాంగ్రెస్ శ్రేణులు భావించారు. అయితే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం అద్దంకి దయాకర్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. దీంతో ఆయన పూర్తిస్థాయిలో సంతృప్తి చెందలేదనే టాక్ వినిపిస్తోంది. ఈ వ్యవహారంలో పార్టీలోని సీనియర్లు కొందరు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డికి మద్దుతుగా నిలుస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్‌, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టార్గెట్‌గా బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. అయితే రేవంత్ వర్గం మాత్రం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కావాలనే ఇలా చేస్తున్నారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అద్దంకి దయాకర్‌ను పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత మరో మెలిక పెట్టరని గ్యారెంటీ ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios