టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ తనయుడు సుహాస్‌కు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్ చేసి బెదిరించినట్లుగా వున్న ఆడియో టేప్ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు చెరుకు సుధాకర్. 

కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ తనయుడు సుహాస్‌కు కోమటిరెడ్డి బెదిరించినట్లుగా వున్న ఆడియో టేప్ కలకలం రేపుతోంది. సొంత పార్టీ నేత, తెలంగాణ ఉద్యమకారుడైన సుధాకర్‌ను, అతని కుమారుడిని చంపుతానంటూ వెంకట్ రెడ్డి బెదిరించినట్లుగా అందులో వుంది. సుహాస్‌కు ఫోన్ చేసి అసభ్యపదజాలంతో విరుచుకుపడ్డారు వెంకట్ రెడ్డి. ప్రజల్లో తిరిగినా, తనపై స్టేట్‌మెంట్ ఇచ్చినా సుధాకర్‌ను చంపుతామని, హాస్పటల్‌ను సైతం ధ్వంసం చేస్తానని ఆయన హెచ్చరించారు. తనపై ప్రకటనలు ఇస్తే ఊరుకోబోనని చంపేస్తానని కోమటిరెడ్డి సదరు ఫోన్ కాల్‌లో సుహాస్‌ను హెచ్చరించారు. చెరుకు సుధాకర్‌ను చంపేందుకు 100 కార్లలో తన అనుచరులు, అభిమానులు తిరుగుతున్నారని.. వారిని తాను ఆపలేనని వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన ఆడియో తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతోంది.

మరోవైపు.. తనను, తన కుమారుడిని చంపుతానంటూ కోమటిరెడ్డి బెదిరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు చెరుకు సుధాకర్. వెంకట్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి అసభ్యపదజాలంతో తనను, తన కుమారుడిని తిట్టడం.. చంపుతానని వార్నింగ్ ఇవ్వడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా, స్టార్ క్యాంపెయినర్‌గా ఒకే పార్టీలో పనిచేస్తున్న విషయం మరిచిపోయి తనపై అలాంటి భాషను ఉపయోగించడం ఏంటని సుధాకర్ మండిపడ్డారు. వెంకట్ రెడ్డిదిగా చెబుతున్న ఆడియో టేప్‌ను తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్ రావు థాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలకు పంపినట్లు సుధాకర్ పేర్కొన్నారు. ఇలాంటి వాళ్ల పెత్తనం ఇంకెన్నాళ్లని ఆయన ప్రశ్నించారు. 

తాను , రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పటిష్టత గురించి మాట్లాడుకున్నట్లు చెరుకు సుధాకర్ తెలిపారు. తాను కోమటిరెడ్డిని వ్యక్తిగతంగా తిట్టిన సందర్భాలు లేవని, ఒకవేళ అలాంటి వ్యాఖ్యలు చేసుంటే దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పెట్టుకోవచ్చని సుధాకర్ అన్నారు. నయిం లాంటి కరడుగట్టిన తీవ్రవాదే తనను ఏమీ చేయలేకపోయాడని.. కోమటిరెడ్డి ఏం చేస్తాడంటూ ఆయన తీవ్రవ్యాఖ్యలు చేశాడు. కాంగ్రెస్ శ్రేణుల దృష్టిలో, తెలంగాణ ప్రజల దృష్టిలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డకౌట్ అయిన వికెట్ అంటూ సుధాకర్ వ్యాఖ్యానించారు. తనపై కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై అధిష్టానం నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.