Asianet News TeluguAsianet News Telugu

షబ్బీర్ అలీని సస్పెండ్ చేయండి... ప్రియాంకా గాంధీకి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ, కలకలం

అసలే అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోన్న టీ.కాంగ్రెస్‌లో మరో కలకలం రేపారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. సీనియర్ నేత షబ్బీర్ అలీని కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన ప్రియాంకా గాంధీకి లేఖ రాశారు. 

congress mp komatireddy venkat reddy letter to priyanka gandhi over shabbir ali
Author
First Published Sep 22, 2022, 7:09 PM IST

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీపై ఫైరయ్యారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. అలీని తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన కోరారు. ఈ మేరకు గురువారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీకి ఆయన లేఖ రాశారు. చీటింగ్ సహా పలు ఇతర కేసుల్లో అలీకి ప్రత్యక్షంగా ప్రమేయం వుందని ఈ సందర్భంగా కోమటిరెడ్డి ఆరోపించారు. ఈ కేసుల నేపథ్యంలో షబ్బీర్ అలీ ఏ క్షణమైనా అరెస్ట్ అయ్యే అవకాశం వుందని కోమటిరెడ్డి పేర్కొన్నారు. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీ పరువు పోతుందని.. అలాగే నష్టం జరుగుతుందని వెంకట్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

మరోవైపు.. మునుగోడు ఉప ఎన్నిక విషయంలో కాంగ్రెస్ పార్టీ వేగంగా పావులు కదుపుతుంది. మునుగోడు ఉపఎన్నికకు తమ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉపఎన్నిక నోటిఫికేషన్ రాకపోయినప్పటికీ.. అభ్యర్థి ఎంపిక విషయంలో ఆలస్యం పార్టీకి నష్టం చేకూరుస్తుందనే అభిప్రాయంతో కాంగ్రెస్ అధిష్టానం ముందుగానే అభ్యర్థిని ఖరారు చేసింది. పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి... టికెట్ ఆశించిన భంగపడిన నేతలను బుజ్జగించే పనిలో పడ్డారు. వారిని బుజ్జగించడంతో పాటు కాంగ్రెస్‌ పార్టీ విజయం కోసం పనిచేయాల్సిందిగా కోరనున్నారు. 

ALso REad:కాంగ్రెస్ చీఫ్‌గా రాహుల్ గాంధీయే వుండాలి.. టీపీపీసీ కీలక తీర్మానం

ఈ క్రమంలోనే నేడు రేవంత్ రెడ్డితో పాల్వాయి స్రవంతి, చలమల కృష్ణారెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ కోసం కలిసి పనిచేయాలని రేవంత్ రెడ్డి.. ఇరువురు నేతలకు సూచించినట్టుగా తెలుస్తోంది. అంతర్గత సమస్యలు లేకుండా.. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా చలమల కృష్ణారెడ్డిని రేవంత్ రెడ్డి బుజ్జగించినట్టుగా తెలుస్తోంది. మునుగోడు టికెట్ ఆశించిన పల్లె రవి, కైలాష్ నేత‌తో కూడా రేవంత్ మాట్లాడనున్నట్టుగా తెలుస్తోంది. 

ఇక, మునుగోడు టికెట్ రావడం అదృష్టంగా భావిస్తున్నట్టుగా పాల్వాయి స్రవంతి చెప్పారు. అసలైన కార్యకర్తలు ఎవరూ పార్టీని వీడటం లేదని అన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి అగ్ని పరీక్షలాంటిదని.. దీనిని ఒక బాధ్యతగా తీసుకుని ముందుకు సాగుతానని చెప్పారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios