Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ చీఫ్‌గా రాహుల్ గాంధీయే వుండాలి.. టీపీపీసీ కీలక తీర్మానం

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో రాహుల్ గాంధీ పోటీ చేయాలని కోరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల పీసీసీలు ఆయనే బాస్‌గా వుండాలని కోరుతూ తీర్మానాలు చేస్తున్నాయి. తాజాగా ఈ లిస్ట్‌లోకి టీపీసీసీ కూడా చేరింది. 
 

TPCC asks Rahul Gandhi to lead Congress party
Author
First Published Sep 21, 2022, 2:34 PM IST

కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టాలంటూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) బుధవారం తీర్మానం చేసింది. టీపీసీసీ ప్రతినిధుల సమావేశంలో ఈ మేరకు తీర్మానానికి ఆమోదం తెలిపింది. దేశాన్నికాపాడేందుకే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ విద్వేష రాజకీయం చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. 

ఇకపోతే... కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ పోటీ చేసే అవకాశం లేదని అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆయన భారత్ జోడో యాత్రలోనే వుంటారని అంటున్నాయి. సెప్టెంబర్ 29న పాదయాత్ర కర్ణాటకలోకి ప్రవేశించనుంది. సెప్టెంబర్ 30తో నామినేషన్‌ల గడువు ముగియనుంది. దీనిని బట్టి రాహుల్ గాంధీ పోటీ చేయకపోవచ్చని అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. అయితే రాహుల్ గాంధీయే అధ్యక్షుడిగా వుండాలని తీర్మానం చేశాయి పలు రాష్ట్రాల పీసీసీలు. మరోవైపు గాంధీ కుటుంబానికి అధ్యక్ష పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు జీ 23 నేతలు. 

మరోవైపు.. ఎల్లుండి కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నోటిఫికేషన్ వెలువడనుంది. 24 నుంచి నామినేషన్‌ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. అక్టోబర్ 17న ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక జరగనుంది. ఏఐసీసీ అధ్యక్ష పదవికి ఒక్కరి కంటే ఎక్కువ మంది పోటీపడితే.. ఎన్నికలు నిర్వహిస్తారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌తో పాటు శశిథరూర్ నామినేషన్ వేసే అవకాశం కనిపిస్తోంది. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేసే అవకాశం వుంటుందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్. ఏకగ్రీవం కాకపోతే ఎన్నిక జరుగుతుందన్నారు. అయితే తమ దృష్టంతా భారత్ జోడో యాత్రపైనే వుందని చెప్పారాయన. 

ALso Read:అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సోనియా, రాహుల్ గాంధీల అనుమతి అవసరం లేదు: కాంగ్రెస్

కాగా.. కనీసం 20 ఏళ్లకు పైగా సోనియా గాంధీ లేదా రాహుల్ గాంధీ చేతుల్లోనే పార్టీ నడిచింది. కానీ, ఈ సారి అధ్యక్ష ఎన్నికలో గాంధీయేతరులు పోటీ చేయడం ఆసక్తికరంగా మారుతున్నది. తిరువనంతపురం ఎంపీ, సీనియర్ పార్టీ లీడర్, కాంగ్రెస్‌ను ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేసిన 23 మంది రెబల్ నేతల్లో ఒకరైనా శశిథరూర్, రాజస్తాన్ సీఎం, సీనియర్ లీడర్, గాంధీ కుటుంబానికి విశ్వాసపాత్రుడు అశోక్ గెహ్లాట్‌లు పోటీ చేయనున్నట్టు తెలుస్తున్నది. సీఎం సీటు వదులుకోవడంపై అశోక్ గెహ్లాట్ కొంత మల్లగుల్లాలు పడుతున్నప్పటికీ పోటీ వీరి ఇద్దరి మధ్య ఉండే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని తెలుస్తున్నది.

మెడికల్ చెకప్ కోసం విదేశాలకు వెళ్లి ఇటీవలే వచ్చిన శశిథరూర్ సోమవారం మధ్యాహ్నం సోనియా గాంధీ నుంచి గ్రీన్ సిగ్నల్ అందుకున్నారు. అక్టోబర్ 17న జరగనున్న అధ్యక్ష ఎన్నికలో పోటీ చేయడానికి రూట్ క్లియర్ చేసుకున్నారు. అదే విధంగా రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కూడా మరో అభ్యర్థిగా తేలడంతో పార్టీ అధ్యక్ష ఎన్నిక రసవత్తరంగా మారింది. రాహుల్ గాంధీనే అధ్యక్షుడు కావాలని డిమాండ్ చేస్తున్నవారు.. పార్టీ యథాతథంగా ఉండాలని కోరుకునే వారి మద్దతు అశోక్ గెహ్లాట్‌కు లభించే అవకాశాలు ఉన్నాయి. అశోక్ గెహ్లాట్ స్వయంగా రాహుల్ గాంధీనే ప్రెసిడెంట్ కావాలని పలుమార్లు కోరారు
 

Follow Us:
Download App:
  • android
  • ios