హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. టీర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. 

2014 ఎన్నికల ప్రచారంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను నట్టేట ముంచిందని ఆరోపించారు. ఐదేళ్లలో టీఆర్ఎస్ పార్టీ కేవలం 50వేల ఉద్యోగాలనే భర్తీ చేసిందని స్పష్టం చేశారు. 

వాస్తవానికి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం ఉన్నా కూడా చేయలేదని మండిపడ్డారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారని అయితే వారు ఎక్కడ ఆందోళనబాట పడతారోనని టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త సచివాలయం, కొత్త అసెంబ్లీ భవనం అంశాలను తెరపైకి తెచ్చిందన్నారు. 

తెలంగాణ ప్రజలు, నిరుద్యోగులు, యువత దృష్టి మళ్లించేందుకే కొత్త సచివాలయం, కొత్త అసెంబ్లీ ప్రతిపాదనలను తీసుకువచ్చారని వాటితో ఎక్కడా లేని హంగామా చేస్తున్నారంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వందేళ్ల గడువు ఉన్న భవనాలను ఎందుకు కూల్చుతానంటున్నారో అర్థం కావడం లేదన్నారు. కొత్త సచివాలయ నిర్మాణం చేసే ఆలోచన లేదని గతంలో కోర్టుకు చెప్పారని కోర్టు ఉత్తర్వులు అమలులో ఉండగా ఎలా కూల్చుతారంటూ నిలదీశారు. కోర్టు ఉత్తర్వులు ధిక్కరించి నిర్మాణాలు చేపడతారా అంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు.