వరద ముంపు ప్రాంతాల్లో సీతక్క పర్యటన.. నడుము లోతు నీటిలో ఇంటింటికి, నేనున్నానంటూ భరోసా
ములుగు జిల్లాలో జంపన్న వాగు ఉధృతికి నీట మునిగిన కొండాయి గ్రామ దుస్ధితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. నడుము లోతు నీటిలో తిరుగుతూ ప్రతి ఇంటికి వెళ్లి వారి కష్టాలను తెలుసుకున్నారు సీతక్క.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణ అతలాకుతలమవుతోంది. వాగులు, వంకలు పోటెత్తడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వందలాది గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. ఈ క్రమంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. నడుము లోతు నీటిలో తిరుగుతూ ప్రతి ఇంటికి వెళ్లి వారి కష్టాలను తెలుసుకున్నారు సీతక్క. ఈ సందర్భంగా బాధితులకు ఆహారం, నీరు వంటి వాటిని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జంపన్న వాగు ఉధృతికి నీట మునిగిన కొండాయి గ్రామ దుస్ధితిని ఆమె అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. చుట్టూ నీరు చేరడంతో దాదాపు 100 మందికిపైగా ప్రజలు ఇళ్లపైకి చేరి సాయం కోసం ఎదురుచూస్తున్నట్లు సీతక్క వెల్లడించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారని.. అయితే వరద ఉధృతి కారణంగా సిబ్బంది సైతం వెనక్కి వచ్చేశారని సీతక్క తెలిపారు. ఇప్పటి వరకు ఆరుగురు గల్లంతయ్యారని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం వారిని కాపాడేందుకు తక్షణం హెలికాఫ్టర్ పంపాలని సీతక్క విజ్ఞప్తి చేశారు.