కళ్ల ముందే బైక్‌తో సహా కొట్టుకుపోయాడు.. చెట్టు కొమ్మతో పైకి వచ్చేద్దామనుకున్నా, చివరికి .. వీడియో వైరల్
హన్మకొండ జిల్లా వేలేరు మండలం కన్నారం వాగుపై బైక్ నడిపిన ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.
తెలంగాణలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్ట్‌ల్లోకి ప్రమాదకర స్థాయిలో వరద నీరు చేరుకుంటూ వుండగా.. గ్రామాలకు గ్రామాలే జలదిగ్భంధంలో చిక్కుకుపోయాయి. వర్షాల నేపథ్యంలో అవసరం వుంటేనే బయటకు రావాలని.. అప్రమత్తంగా వుండాలని ప్రభుత్వం, అధికారులు ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నా కొందరు తమకేం కాదులే అన్నట్లుగా ప్రవర్తిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా హన్మకొండ జిల్లా వేలేరు మండలం కన్నారం వాగుపై బైక్ నడిపిన ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. అతనిని మహేందర్‌గా గుర్తించారు.
ALso Read: కడెం ప్రాజెక్ట్ వద్ద అదుపులోనే పరిస్ధితి.. వదంతులు నమ్మొద్దు : ఇంద్రకరణ్ రెడ్డి
బైక్‌తో సహా వాగులో పడిపోయినప్పటికీ మహేందర్ తేరుకుని వెంటనే ఓ చెట్టుకొమ్మను పట్టుకున్నాడు. దాని ద్వారా పైకి చేరుకుందామనుకున్నా కొమ్మ కూడా ఊడిపోయి చేతిలోకి వచ్చేయడంతో మహేందర్ ఆ ప్రవాహ వేగానికి వాగులో కొట్టుకుపోయాడు. వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. మహేందర్ వాగులో కొట్టుకుపోతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.