Asianet News TeluguAsianet News Telugu

మునుగోడు ఉపఎన్నిక .. టీఆర్ఎస్- బీజేపీల మధ్య చీకటి ఒప్పందం : జగ్గారెడ్డి ఆరోపణలు

మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. మోడీ- కేసీఆర్ స్థాయిలోనే బీజేపీ, టీఆర్ఎస్‌ మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని ఆయన ఆరోపించారు. 

congress mla jagga reddy sensational comments on trs and bjp over munugode bypoll
Author
First Published Oct 11, 2022, 7:02 PM IST

మునుగోడు ఉపఎన్నిక తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠకు కారణమవ్వగా.. తెలంగాణలో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది. టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారిన తర్వాత జరుగుతోన్న తొలి ఉపఎన్నిక కావడంతో ఇక్కడ గెలవాలని కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. మొత్తం గులాబీ బలగాలను ఇక్కడే మోహరిస్తున్నారు. తాజాగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి టీఆర్ఎస్- బీజేపీలపై మండిపడ్డారు. ఈ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్‌ను లేకుండా చేయాలని ఈ రెండు పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని జగ్గారెడ్డి ఆరోపించారు. వంద కోట్ల రూపాయలు ఎన్నికల కోసం వాడుతున్నాయని... మోడీ- కేసీఆర్ స్థాయిలోనే బీజేపీ, టీఆర్ఎస్‌ మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని ఆయన ఆరోపించారు. 

అయితే ఎవరు ఎంత ఇచ్చినా తీసుకోవాలని... ఓటు మాత్రం కాంగ్రెస్‌కు వేయాలని జగ్గారెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. మునుగోడులో ప్రచారానికి ఎవరూ రాకున్నా కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టమేమీ లేదన్నారు. తన సోదరుడు ప్రత్యర్ధి పార్టీ తరపున పోటీ చేస్తున్నారని... అందువల్ల ప్రచారానికి వెళ్లలేనని వెంకట్ రెడ్డి అధిష్టానానికి తెలియజేశారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. అయితే ఈ ప్రతిపాదనకు అధిష్టానం ఒప్పుకుందో.. లేదో తనకు తెలియదన్నారు. చండూరులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అగ్నిప్రమాదం వెనుక టీఆర్ఎస్, బీజేపీల హస్తం వుందని జగ్గారెడ్డి ఆరోపించారు. 

ALso REad:కాంగ్రెస్ ఆఫీసులో అగ్నిప్రమాదం.. ఇలాగే వదిలేస్తే, రేపు మా కార్యకర్తలను చంపినా అడిగేవారెవ్వరు : వీహెచ్

కాగా... మునుగోడు నియోజకవర్గం చండూరు మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అగ్నిప్రమాదం పలు అనుమానాలకు తావిస్తోంది. సరిగ్గా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సభ జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ హనుమంతరావు స్పందించారు. ఇలాంటి ఘటనలను ఉపేక్షించరాదని, దీనిపై చర్యలు తీసుకోకుంటే రేపు మరొక ఘటన జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏదో ఒకటి తేల్చుకునేందుకు సిద్ధంగా వున్నారని వీహెచ్ హెచ్చరించారు. రేపటి రోజున తమ కార్యకర్తలను చంపేసినా అడిగేవారెవ్వరు అంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చండూరు ఘటనపై ప్రభుత్వం, ఎన్నికల సంఘం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని వీ హనుమంతరావు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనకు దిగుతామని ఆయన హెచ్చరించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios