కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎల్లుండి తాను, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఖమ్మం వెళ్తనున్నట్టుగా చెప్పారు. కాంగ్రెస్ నేతలపై అక్రమంగా పీడీ యాక్ట్ పెట్టిన పోలీసులపై దండయాత్ర చేస్తామని అన్నారు.

తెలంగాణ ప్రజలకు ప్రత్యేక రాష్ట్రాన్ని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ గిఫ్ట్‌గా ఇచ్చారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు.. కాంగ్రెస్‌ను 15 లోక్‌సభ స్థానాల్లో గెలిపించి రాహుల్ గాంధీకి గిఫ్ట్ ఇవ్వాలని కోరారు. రాహుల్ గాంధీ వరంగల్ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను కోరారు. బుధవారం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ తీపి మాటలు మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తుంటే ... బండి సంజయ్ పనికిమాలిన మాటలు మాట్లాడి ప్రజలను రెచ్చగొడుతున్నాడని విమర్శించారు. 

కేసీఆర్ కుటుంబానికి పదేళ్లు అధికారం ఇచ్చారని.. వాళ్లు సెటిల్ అయ్యారని ఆరోపించారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు సెటిల్ కావాల్సి ఉందని దఅన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు తెలంగాణ కి పూర్తి సమయం ఇస్తా అని రాహుల్ గాంధీ చెప్పారని తెలిపారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలో లేకపోవడం తో ప్రజల ఆకాంక్షలు అమలు కాలేదని చెప్పారు. 

రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పిన కేసీఆర్.. ఆ హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. వరికి గిట్టుబాటు ధర లేదన్నారు. కేసీఆర్ వరి వేయొద్దు అనడంతో.. 40 శాతం రైతులు వరి వేయలేదన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ దాగుడు మూతలు ఆడుతున్నాయని విమర్శించారు. రెండు పార్టీలు కలిసి రైతుల పొట్ట కొట్టాయని ఆరోపించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీ కి పోవాలని టీఆర్‌ఎస్ మైండ్ గేమ్ ఆడుతుందని ఆరోపించారు. వ్యతిరేక ఓటు చీలి మళ్లీ అధికారం లోకి రావాలని trs కుట్ర రాజకీయం చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో రాకుండా బీజేపీ, టీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నాయన్నారు. బండి సంజయ్ కి తు..తెలియదు..తా తెలియదని ఎద్దేవా చేశారు. టీవీలను పిలిచి బౌ భౌ అని అరుస్తారని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. రాజకీయం చేసేదంతా బీజేపీ అధిష్టానమేనని విమర్శించారు. 

 రాహుల్ గాంధీ సభకు రైతులు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని తెలంగాణ లో బలోపేతం చేయాలని ప్రజలకు కోరారు. ఐదు లక్షల మందితో రాహుల్ గాంధీ సభ నిర్వహించనున్నట్టుగా చెప్పారు. తెలంగాణలో నేరాలు,ఘోరాలు పెరిగిపోయాయని.. కొందరు పోలీసులు పోలీస్ స్టేషన్ లు ఎప్పుడో వదిలేశారని ఆరోపించారు. రాష్ట్రంలో రోజు జరిగే ఘటనల్లో టీఆర్ఎస్ నేతలే నిందుతులని అన్నారు. 

కోదాడలో టీఆర్ఎస్ కార్పొరేటర్ కొడుకు అత్యాచారం చేసినట్టు వార్తలు వచ్చాయని చెప్పారు. తెలంగాణ పోలీస్ ఇంటలిజెన్స్ నిద్ర మత్తులో ఉందని విమర్శించారు. ఇంటిలిజెన్స్ ఫెయిల్ అయ్యిందని మండిపడ్డారు. ఇన్ని నేరాలు జరుగుతుంటే కేసీఆర్ ఏం చేస్తున్నారు... ఎందుకు సైలెంట్ గా ఉన్నారని ప్రశ్నించారు. క్రైమ్ జరిగితే పోలీసుల కంటే ముందు...మీడియాకే తెలుస్తుందన్నారు. ఇంటలిజెన్స్ పై కేసీఆర్ సమీక్ష చేయాలని కోరారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదన్నారు. 

తెలంగాణ రాజకీయాలను ప్రక్షాళన మొదలు పెట్టాలని రాహుల్ గాంధీ నిర్ణయించారని చెప్పారు. మా వల్ల ఓ తల్లి కొడుకు చనిపోయాడు అన్న ఫీలింగ్ టీఆర్ఎస్ నాయకులకు లేదని.. పోలీసుల భయం కూడా వారికి లేదని అన్నారు. డీజీపీ ఎందుకు సైలెంట్ గా ఉన్నారని ప్రశ్నించారు.

ఈ నెల 21న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, తాను ఖమ్మం వెళ్తున్నట్టుగా చెప్పారు. కాంగ్రెస్ నేతలపై పెట్టిన పీడీ యాక్ట్ కేసుల సంగతి తెలుస్తానని వ్యాఖ్యానించారు. ఖమ్మలో ఎం చేస్తాం అనేది చూపిస్తామన్నారు. తమ పార్టీ నాయకుల పై కేసులు పెట్టిన పోలీసుల పై దండయాత్ర చేస్తామని చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త కుటుంబంను కూడా పరామర్శ చేస్తామని చెప్పారు. పార్టీ కార్యకర్త లాగా కాకుండా.. సాధారణ పౌరుడిగా పరామర్శ చేస్తానని తెలిపారు.