పొత్తులపై రాహుల్ గాంధీ మాటలే ఫైనల్: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలపై జగ్గారెడ్డి
పొత్తులపై కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ తమ విధానాన్ని ఇప్పటికే స్పష్టం చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. ఈ విషయంలో కార్యకర్తలు గందరగోళ పడాల్సిన అవసరం లేదన్నారు.
హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్‌తో తమ పార్టీ పొత్తుకు సిద్దంగా లేదని కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తేల్చి చెప్పారు. మంగళవారంనాడు హైద్రాబాద్ లో ఆయన ఓ తెలుగు న్యూస్ చానెల్ తో మాట్లాడారు. తెలంగాణలో ఎన్నికల్లో పొత్తుల విషయమై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పిన మాటలే ఫైనల్ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గందరగోళానికి గురి కావాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. తమ పార్టీతో పొత్తుకు బీఆర్ఎస్ కూడా ఆలోచన చేయదన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ లు గతంలో పనిచేసిన విషయాన్ని జగ్గారెడ్డి గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పలు బిల్లులకు బీఆర్ఎస్ మద్దతిచ్చిన విషయాన్ని జగ్గారెడ్డి ప్రస్తావించారు. తమపై ఆరోపణలు చేసే అర్హత బీజేపీకి లేదని జగ్గారెడ్డి చెప్పారు.
కాంగ్రెస్ లో ముఖ్య నాయకుడు ఒకరు పార్టీలో కోవర్టులున్నారని చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. 2023 ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో ఎవరూ కూడా వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని జగ్గారెడ్డి కోరారు. ఎన్నికల సమయంలో ఏ పార్టీతో కూడా పొత్తు ఉండదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారన్నారు. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తు విషయమై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు మాత్రం ఆయన నిరాకరించారు. పార్టీలో స్టార్ లు , సూపర్ స్టార్లు ఇట్లా మాట్లాడుతుంటే ఎవరికి ఏం చెప్పే పరిస్థితి లేదన్నారు.
also read:బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తుపై కోమటిరెడ్డి వ్యాఖ్యల కలకలం: తప్పు బడుతున్న సీనియర్లు
2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పొత్తులుంటాయని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకంట్ రెడ్డి ఇవాళ వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదన్నారు. హంగ్ అసెంబ్లీ వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. సెక్యులర్ పార్టీగా ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య పొత్తులు కుదిరే అవకాశం ఉందన్నారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలానికి కారణమయ్యాయి.