సంగారెడ్డి:ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తే ఆర్టీసీ కార్మికులతో పాటు తాను కూడ సీఎం  కేసీఆర్ కు పాలాభిషేకం చేస్తానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు.

సోమవారం నాడు సంగారెడ్డి  ఆర్టీసీ బస్సు డిపో వద్ద కార్మికులకు సంఘీభావంగా  నిర్వహించిన సభలో  ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడారు.మంగళవారం లోపుగా  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేలా సీఎం కేసీఆర్ ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  ఒప్పించాలని ఆయన కోరారు. 

ఒకవేళ మంత్రి పువ్వాడ అజయ్  సీఎం కేసీఆర్ ను ఒప్పించకపోతే తాము మంత్రి పువ్వాడ అజయ్  ఇంటిని ముట్టడిస్తామని జగ్గారెడ్డి హెచ్చరించారు.ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని జగ్గారెడ్డి కోరారు.

ఆర్టీసీ కార్మికులవి న్యాయమైన డిమాండ్లు అని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు మంత్రి పువ్వాడ అజయ్ చొరవ చూపాలని ఆయన కోరారు.

తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు ఈ నెల 5వ తేదీ నుండి  సమ్మె నిర్వహిస్తున్నారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు సెల్ప్ డిస్మిస్ అయినట్టుగా సీఎం కేసీఆర్ ప్రకటించారు.

ఈ ప్రకటనతో ఆర్టీసీ కార్మికులు మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇప్పటికే ఇద్దరు కార్మికులు ఆత్మహత్య చేసుకొన్నారు. సోమవారం నాడు మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.