అధిష్టానం బుజ్జగించినప్పటికీ కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి టీఆర్ఎస్‌లోకి వెళ్లేందుకే మొగ్గు చూపారు. సోమవారం రాత్రి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను కలిసిన అనంతరం పార్టీ ఎందుకు మారాల్సి వస్తుందనే దానిపై గండ్ర ఓ ప్రకటన విడుదల చేశారు.

భూపాలపల్లి జిల్లా సమగ్రాభివృద్ధికి, సింగరేణి కార్మికుల ఆకాంక్షలను సాకారం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి టీఆర్ఎస్‌తోనే సాధ్యమన్న ఆయన.. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రణాళికాబద్ధంగా, చిత్తశుద్ధితో పనిచేస్తున్న కేసీఆర్‌కు ప్రజలు రెండోసారి అధికారమిచ్చారన్నారు.

ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడుచుకోవడం ప్రజాప్రతినిధిగా నా విధి. భూపాలపల్లి జిల్లా, నియోజకవర్గ ప్రజలు తనపై ఉంచిన విశ్వాసాన్ని కాపాడుకుంటానని గండ్ర స్పష్టం చేశారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి త్వరలో టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు.

అనంతరం భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న గండ్ర భార్య జ్యోతి ఆ పదవికి రాజీనామా చేస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి రాజీనామా లేఖ పంపారు.

తనకు అవకాశం ఇచ్చి.. రాజకీయంగా ప్రొత్సహించినందుకు సోనియా, రాహుల్, ఉత్తమ్‌, భట్టీ, జానారెడ్డిలకు జ్యోతి ధన్యవాదాలు తెలిపారు. తన భర్త టీఆర్ఎస్‌లో చేరుతున్నందున నైతికంగా కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగడం భావ్యం కాదు కనుక రాజీనామా చేస్తున్నట్లు ఆమె లేఖలో పేర్కొన్నారు.