హుజూరాబాద్ బైపోల్: స్థానికులకే ప్రాధాన్యత, ఈ నెల 10 తర్వాత కాంగ్రెస్ అభ్యర్ధిపై నిర్ణయం
హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్న నేతల నుండి ధరఖాస్తులను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది.ఈ నెల 10వ తేదీ తర్వాత అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
హైదరాబాద్: హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధిపై ఈ నెల 10వ తేదీ తర్వాత కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఈ స్థానం నుండి పోటీ చేసే ఆశావాహుల నుండి కాంగ్రెస్ పార్టీ ధరఖాస్తులను ఆహ్వానించింది.రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ ముఖ్యుల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో హుజూరాబాద్ అభ్యర్ధి ఎంపిక విషయమై చర్చించారు. ఈ సమావేశంలో కొండా సురేఖ అభ్యర్ధిత్వంపై నేతలు మొగ్గుచూపారు.
అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబుల అభిప్రాయం తీసుకొన్న తర్వాతే ఎఐసీసీకి నివేదికను పంపాలని నిర్ణయించారు. ఈ మేరకు నేతల అభిప్రాయ సేకరణకు గాను సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహలకు బాధ్యతలను అప్పగించారు.
హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసే ఆశవాహుల నుండి ఈ నెల 9వ తేదీ వరకు ధరఖాస్తులను స్వీకరిస్తారు. ధరఖాస్తు చేసుకొనేందుకు అభ్యర్థుల నుండి కొంత నగదును ఫీజుగా వసూలు చేస్తారు.హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన స్థానికుడినే ఈ ఉప ఎన్నికల్లో పోటీలో నిలపాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నేతలు కోరుతున్నారు.ఈ విషయమై పార్టీ నాయకత్వానికి తమ అభిప్రాయాన్ని చెప్పనున్నారు.
హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ మాత్రం అభ్యర్ధి వేటలో ఉంది. ఈ రెండు పార్టీలు ఇప్పటికే పోటా పోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి.