Asianet News TeluguAsianet News Telugu

పాలమూరు కాంగ్రెస్ కు షాక్ : కారెక్కనున్న ముగ్గురు నేతలు

టిఆర్ఎస్... ఆపరేషన్ ఆకర్ష్

Congress leaders will join in TRS in the presence of KCR

పాలమూరులో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగలనుంది. ఇప్పటికే ఆ పార్టీ నుంచి మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లో చేరిపోయారు. ఆయనతోపాటు అనేక మంది లీడర్లు కారెక్కేశారు. తాజాగా నాగర్ కర్నూలులో సుదీర్ఘకాలం పాటు రాజకీయాలు నడిపిన నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని జీర్ణించుకోలేక ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కూడా కారెక్కనున్నారు. ఆయన శనివారం సాయంత్రం 6 గంటలకు టిఆర్ఎస్ లో చేరనున్నారు. ఆయనతోపాటు మాజీ అలంపూర్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే అబ్రహం, కల్వకుర్తికి చెందిన మరో మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కృష్ణారెడ్డి కూడా టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. వీరు ముగ్గురు నేతలు హైదరాబాద్ వచ్చి కేసిఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకుంటారు. దీనికి సంబంధించి కసరత్తు పూర్తయినట్లు చెబుతున్నారు.

అయితే కాంగ్రెస్ పార్టీలోకి టిడిపికి సంబంధించిన నేతలంతా పాలమూరులో క్యూ కడుతుంటే వారికి చిరకాల ప్రత్యర్థులుగా ఉన్నవారు కాంగ్రెస్ ను వీడి టిఆర్ఎస్ వైపు పరుగులు తీస్తున్నారు. నాగం జనార్దన్ రెడ్డి రాకతో మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ కూడా గుర్రుగా ఉన్నారు. ఆమె వర్గంగా ముద్ర పడిన నేతలంతా ఒక్కొక్కరుగా కారరెక్కుతున్నారు. అయితే శుక్రవారం జానారెడ్డి నివాసంలో జరిగిన సిఎల్పీ సమావేశానికి డికె అరుణ డుమ్మా కొట్టారు. నియోజకవర్గంలో కీలకమైన సమావేశం ఉన్న కారణంగా తాను సిఎల్పీ సమావేశానికి రాలేనని ముందుగానే చెప్పారు. అయితే ఆమె నాగం రాకను జీర్ణించుకోలేకనే నిరసన తెలుపుతున్నట్లు చెబుతున్నారు. అందుకే ఆమె సిఎల్పీ సమావేశానికి రాలేదన్న చర్చ ఉంది.

ప్రస్తుతం పార్టీ మారుతున్నవారిలో ఎవరికి కూడా రానున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ తరపున ఈ ముగ్గురిలో ఎవరికి టికెట్ దక్కుతుంది? ఎవరికి దక్కదు అన్న చర్చలు ఊపందుకున్నాయి. అయితే ఎడ్మ కృష్ణారెడ్డికి కల్వకుర్తిలో, టికెట్ రావొచ్చన్న ప్రచారం ఉంది. అయితే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ బలమైన నాయకుడు ఉన్నారు. ఆయనకు కాదని టికెట్ ఇస్తారా అన్నది చూడాలి. నాగర్ కర్నూలులో సిట్టింగ్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిని కాదని కూచుకుళ్ల దామోదర్ కు కానీ, ఆయన తనయుడికి కానీ టికెట్ వస్తుందా అన్నది అనుమానాస్పదంగానే ఉంది. ఇక అలంపూర్ లో అబ్రహం కు టికెట్ వస్తదా? రాదా అన్న చర్చ ఉంది. ఎందుకంటే అక్కడ మాజీ ఎంపి మందా జగన్నాథం తనయుడు గతంలో పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం మందా తనయుడు మళ్లీ అదే నియోజకవర్గంలో పోటీ చేస్తారా లేదా అన్నది చూడాలి.

మొత్తానికి ముగ్గురు కాంగ్రెస్ లీడర్లు పార్టీని వీడి టిఆర్ఎస్ లో చేరనుండడం పాలమూరు పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

Follow Us:
Download App:
  • android
  • ios