హైదరాబాద్: ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందించాలని కోరుతూ గవర్నర్ కి తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈ నెల 4వ తేదీన వినతి పత్రం సమర్పించనున్నారు.డీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలతో  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణికం ఠాగూర్  ఇవాళ  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  కరోనా వ్యాక్సిన్  ను అందరికీ ఉచితంగా ఇవ్వాలని కోరుతూ గవర్నర్  తమిళిసై సౌందర రాజన్ కి వినతి పత్రం సమర్పించనున్నారు. మరో వైపు ఇదే డిమాండ్ తో ఈ నెల 7వ తేదీన  గాంధీభవన్ తో పాటు జిల్లా కేంద్రాల్లో దీక్షలు చేయాలని నిర్ణయం తీసుకొన్నారు.

రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై కూడ చర్చించారు. పార్టీబలోపేతంపై తీసుకోవాల్సిన చర్యలపై నేతలు మాట్లాడారు. కరోనా నేపథ్యంలో పాలకుల నిర్లక్ష్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకొన్నారు. కరోనా వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. వ్యాక్సినేషన్ విషయంలో  కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శలు చేశారు.అందరికీ వ్యాక్సిన్ అందించే విషయమై ఫార్మా కంపెనీలతో కేంద్రం చర్చించింది. ఉత్పత్తిని పెంచాలని కోరింది. మరోవైపు వ్యాక్సిన్  ఫార్మాలాలను ఇతర ఫార్మా కంపెనీలు అందించి ఉత్పత్తిని పెంచాలని కేంద్రం భావిస్తోంది. విదేశీ వ్యాక్సిన్లకు కూడ కేంద్రం అనుమతి ఇవ్వనుంది.