టీపీసీసీ కమిటీల నియామకంపై అసంతృప్తి: హైకమాండ్‌కు ఫిర్యాదు చేయనున్న నేతలు
పీసీసీ కమిటీల నియామకంలో కాంగ్రెస్ పార్టీ నేతలు అసంతృప్తితో ఉన్నారు.ఈ విషయమై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారు. ఈ విషయమై నిన్ననే సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నివాసంలో చర్చించారు.
హైదరాబాద్: టీపీసీసీ కమిటీలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్లు భగ్గుమంటున్నారు. కమిటీల్లో అనర్హులకు చోటు కల్పించారని కాంగ్రెస్ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని కాంగ్రెస్ నేతలు కొందరు నిర్ణయం తీసుకున్నారు.
ఈ నెల 10వ తేదీన పీసీసీ కమిటీలను ఎఐసీసీ ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన టీపీసీసీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో 18 మందికి చోటు కల్పించారు. 40 మందితో ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటు చేశారు. 24 మంది ఉపాధ్యక్షులు, 84 మంది ప్రధాన కార్యదర్శులను నియమించారు. అయితే ఈ కమిటీల్లో మాజీ మంత్రి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి పార్టీ నాయకత్వం చోటు కల్పించలేదు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో తనకు చోటు కల్పించకపోవడంపై మాజీ మంత్రి కొండా సురేఖ అసంతృప్తిని వ్యక్తం చేశారు. పీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఈ నెల 11న ఆమె రాజీనామా చేశారు. తన కంటే జూనియర్లకు పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో చోటు కల్పించారని ఆమె ఆరోపించారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్ కూడా తన పదవికి రాజీనామా చేశారు.
పీసీసీ కమిటీల విషయమై ఈ నెల 12న సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నివాసంలో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి కోదండరెడ్డి, వి.హనుమంతరావు, మదు యాష్కీ, మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పీసీసీ కమిటీల విషయమై నేతలు చర్చించారు.
also read:పీసీసీ కమిటీల నియామకంపై అసంతృప్తి: సీఎల్పీ నేత భట్టి నివాసంలో నేతల భేటి
పీసీసీ కమిటీల ఏర్పాటు విసయమై సీఎల్పీ, పీసీసీ చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కానీ దీనికి భిన్నంగా ఈ దఫా పీసీసీ కమిటీని ఏర్పాటు చేశారని సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క చెప్పారు. పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ కే ఈ విషయం తెలియాలని భట్టి విక్రమార్క చెప్పారు. పీసీసీ కమిటీల ఏర్పాటు విషయంలో తనకు సమాచారం ఇవ్వకపోవడంపై భట్టి విక్రమార్క తన అసంతృప్తిని బయటపెట్టారు .1990 నుండి కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో క్రియాశీలకంగా తాను ఉన్న విషయాన్ని భట్టి విక్రమార్క గుర్తు చేస్తున్నారు. ఏ జిల్లాల్లో ఎవరికి కమిటీల్లో చోటు కల్పిస్తే ప్రయోజనం ఉంటుందో తనకు అవగాహన ఉందన్నారు. కానీ ఈ విషయమై తనను ఎవరు కూడా సమాచారం అడగలేదన్నారు. ఎఐసీసీ ప్రకటించిన కమిటీల్లో సామాజిక సమతుల్యత లేదని కొందరు నేతలు తన దృష్టికి తెచ్చిన విషయాన్ని భట్టి విక్రమార్క గుర్తు చేశారు. అంతేకాదు ఈ కమిటీల్లో కొన్ని జిల్లాల నుండి సీనియర్లకు చోటు కల్పించలేదు.
ఇదిలా ఉంటే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు పీసీసీ కమిటీలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నేతలతో మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సమావేశం కానున్నారు. పీసీసీ కమిటీల నియామకంపై చర్చించనున్నారు. పీసీసీ కమిటీల నియామకంలో లోటు పాట్లను పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని కాంగ్రెస్ నేతలు కొందరు భావిస్తున్నారు. పార్టీ కోసం పనిచేస్తున్న నేతలకు ఎలా అన్యాయం జరిగిందనే విషయాన్ని ఎఐసీసీ చీఫ్ దృష్టికి తీసుకెళ్లనున్నారు.