Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ కాంగ్రెస్‌లో రోజుకో గొడవ: మర్రి శశిధర్ రెడ్డి వ్యాఖ్యలకు అద్దంకి దయాకర్ కౌంటర్

తెలంగాణ కాంగ్రెస్ లో రోజుకో గొడవ తెర మీదికి వస్తుంది. పార్టీ నేతల మధ్య సమన్వయ లోపం, ఆధిఫత్య పోరును ఈ గొడవలు సూచిస్తున్నాయి. సీనియర్లు కొందరు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరుపై మండిపడుతున్నారు. 

 Congress leaders Addanki dayakar Releases Video On Marri shashidhar Reddy Comments
Author
Hyderabad, First Published Aug 18, 2022, 11:08 AM IST

హైదరాబాద్: తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో ప్రతి రోజూ ఏదో ఒక రకమైన గొడవ తెరమీదికి వస్తుంది.  మర్రి శశిధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పు బడుతూ అద్దంకి దయాకర్ వీడియో విడుదల చేయడం చర్చకు దారి తీసింది. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై పార్టీలోని సీనియర్లు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. వివాదాలకు దూరంగా ఉంటారనే పేరున్న మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి లాంటి నేతలు కూడా బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. పార్టీని కాపాడుకొనే ఉద్దేశ్యంతోనే తాము ఈ వ్యాఖ్యలు చేస్తున్నామని నేతలు  చెబుతున్నారు. త్వరలోనే మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి.ఈ తరుణంలో కాంగ్రెస్ నేతల మధ్య సమన్వయలోపం ప్రస్తుతం చర్చకు దారి తీసింది.  

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్ లో కాకుండా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొంటారని సీనియర్లు అసంతృప్తితో ఉన్నారు. ఈ రకమైన పద్దతి పార్టీకి నష్టం చేసే అవకాశం ఉందని పార్టీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.  

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడిన సమయంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తప్పుబట్టారు. కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాండ్  ఏమీ లేదు, బ్రాండీ షాపు నడుపుకొనే వాళ్లంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.ఈ వ్యాఖ్యలను ఉప సంహరించుకోవడంతో పాటు క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు.తాను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశానని రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తమ వాడేనని పార్టీ కోసం సుశిక్షితుడైన  కార్యకర్తగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పనిచేస్తారని ఆయన గుర్తు చేశారు.

ఆ తర్వాత కూడా రేవంత్ రెడ్డి చేసిన హోంగార్డు ఐపీఎస్ వ్యాఖ్యలు కూడా  కలకలం రేపాయి. ఈ వ్యాఖ్యల విషయాన్ని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తప్పు బట్టారు.మునుగోడు ఉప ఎన్నికల్లో తమ లాంటి హోంగార్డలతో అవసరం ఏముందని ప్రశ్నించారు. ఐపీఎస్ లు వెళ్లి ఈ ఎన్నికల్లో ప్రచారం చేస్తారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  అంతకు ముందు ఈ నెల 5న నిర్వహించిన సభలో అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలను కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రస్తావించారు. వేదికపై సీనియర్లు ఉన్న సమయంలో కూడ అద్దంకి దయాకర్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేసానా కూడ పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. కానీ షోకాజ్ పేరుతో నాటకాలు ఆడారన్నారు.

ఈ వ్యాఖ్యల తర్వాత రేవంత్ రెడ్డి  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి క్షమాపణలు చెప్పారు. మరో వైపు కాంగ్రెస్  అద్దంకి దయాకర్  కూడా కోమటిరెడ్డి కి క్షమాపణలు చెబుతూ వీడియోను విడుదల చేశారు.  
ఈ తరుణంలోనే మర్రి శశిధర్ రెడ్డి బహిరంగంగా వ్యాఖ్యల చేయడం కలకలం రేపుతుంది. ఈ విషయమై అద్దంకి దయాకర్ వీడియోను విడుదల చేశారు. పార్టీ సీనియర్ నేతగా ఉండి అంతర్గత వేదికల్లోనే ఈ తరహా వ్యాఖ్యలు చేయాల్సిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ అవకాశం ఉండి కూడా ఎందకు బహిరంగంగా వ్యాఖ్యలు చేశారని అద్దంకి దయాకర్ ఈ వీడియోలో ప్రశ్నించారు.. ఈ వీడియో ప్రస్తుతం పార్టీ నేతల మధ్య ఉన్న సమన్వయలోపాన్ని ఎత్తి చూపుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ ను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఏజంట్ అంటూ  మర్రి శశిధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఠాగూర్ కూడా స్పందించారు. శశిధర్ ఏం  అన్నారో తనకు తెలియదన్నారు. తాను ఎవరికీ కూడా ఏజంట్ ను కాదన్నారు. సోనియా గాంధీకి మాత్రమే ఏజంట్ నని ఆయన స్పష్టం చేశారు. మర్రి శశిధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల  వీడియోను పార్టీ అధిష్టానానికి పంపేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని సమాచారం. 

మునుగోడు ఉప ఎన్నికల్లో తమ పట్టును నిలుపుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. ఈ మేరకు మండలాల వారీగా ఇంచార్జీలను నియమించింది. ఈ నియోజకవర్గంలోని గ్రామాల్లో పార్టీ క్యాడర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైపునకు తరలివెళ్లకుండా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చర్యలు తీసుకొంటుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios