తెలంగాణలో శుక్రవారం రాత్రి నుంచి ఆర్టీసీ అధికారులు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. కాగా... కార్మికులు సమ్మెకు దిగడానికి కేసీఆర్ అహంకారమే కారణమని కాంగ్రెస్ పార్టీ మహిళా నేత విజయశాంతి ఆరోపించారు. నకు మద్దతుగా నిలిచి, ఉద్యమాన్ని నడిపించిన ఉద్యోగులు, విద్యార్ధుల పట్ల అధికారపు అహంకారంతో తెలంగాణ సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న నిరంకుశ ధోరణిని చూసి తెలంగాణ ప్రజలు రగిలిపోతున్నారని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి ఆరోపించారు.
 
తాను సీఎంను గనుక తనమాటే నెగ్గాలని, తనను ప్రశ్నిస్తే ఎంతటి వారినైనా అణచివెయ్యాలనే విధంగా కేసీఆర్ వైఖరి ఉందని విజయశాంతి చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో ప్రదర్శించిన ఆధిపత్య ధోరణితో సీఎం అసలు స్వరూపం బయటపడిందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ముఖ్యమైన పండుగగా భావించే దసరా పండుగను... ఆర్టీసీ సమ్మె వల్ల బంధువులతో కలిసి జరుపుకోలేని దారుణ స్థితికి కేసీఆర్ మొండి వైఖరే కారణమని విజయశాంతి చెప్పారు. 

అందరి ఆనందాన్ని ఆవిరి చేసి, తాను, తన కుటుంబం మాత్రం దసరా పండుగను జరుపుకోవాలనుకోవడం కేసీఆర్ దొరతనానికి నిదర్శనమని ఆమె చెప్పారు. కేసీఆర్ తీరుకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తమ డిమాండ్లు నెరవేర్చలేదనే కారణంతో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే. 

శుక్రవారం సాయంత్రం త్రిసభ్య కమిటీతో మరోసారి జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మె అనివార్యమైంది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభమవుతుందని జేఏసీ ప్రకటించింది. రాష్ట్రంలో సకల జనుల సమ్మెను మించిన సమ్మె ప్రస్తుతం అవసరమని.. అద్దె బస్సు  డ్రైవర్లు దీనికి సహకరించాలని కార్మిక సంఘాలు కోరాయి.

ఆర్టీసీలోని 50 మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటారని.. ఎవరైనా డ్రైవర్లు బస్సులు నడిపితే వేలాది మంది కార్మికులకు ద్రోహం చేసినట్లేనని అశ్వత్థామరెడ్డి తెలిపారు.మరోవైపు సర్వీసులు పెంచాలని ఓలా, ఉబెర్‌, మెట్రో సంస్థలను కోరారు... సర్వీసులను పెంచడంతోపాటు ఎక్కువ ఛార్జ్‌ చేయొద్దని మెట్రో అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

దీంతో స్పందించిన మెట్రో అధికారులు మెట్రో సర్వీసుల సమయాన్ని పెంచారు. తెల్లవారుజాము నుంచి అర్థరాత్రి వరకు మెట్రో సర్వీసులు నడుస్తుందని హైదరాబాద్ మెట్రో రైల్ ప్రకటించింది.ఆర్టీసీలో అందుబాటులో ఉన్న 2100 అద్దెబస్సులు నడపాలని భావిస్తున్నట్లు త్రిసభ్య కమిటీ సభ్యుడు సునీల్‌ శర్మ తెలిపారు. తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లను భర్తీ చేసి నడుపుతాం.

3 వేల మంది డ్రైవర్లను తీసుకుంటాం. స్కూల్‌ బస్సులు 20వేలు ఉన్నాయి. ప్రైవేటు, స్కూల్‌, అద్దె బస్సులను నడుపుతాం. అవసరమైతే పోలీసుల సహకారం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.డ్రైవర్లకు రూ. 1,500, కండక్టర్లకు 1,000, రిడైర్డ్ సూపర్ వైజర్లకు 1,500, రిడైర్డ్ మెకానిక్‌లకు 1,000, రిడైర్డ్ క్లర్క్‌లకు 1,000 చొప్పున రోజూ వేతనంగా చెల్లించడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.