తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా దూసుకుపోతున్న విజయశాంతి.. అవకాశం వచ్చిన ప్రతిసారీ అధికార పక్షం పై విమర్శలు గుప్పిస్తూనే ఉంటారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఆమె.. ఎప్పటికప్పుడు కేసీఆర్, కేటీఆర్ లపై ట్విట్టర్ వేదికగా విమర్శలు కురిపిస్తూనే ఉంటారు. 

గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార కమిటీ ఛైర్మన్ గా పనిచేసిన ఆమెకు ఇప్పటి వరకు పోటీ చేసేందుకు సరైన నియోజకవర్గం దొరికింది లేదు. అయితే.. త్వరలో జరగపోయే దుబ్బాక ఉప ఎన్నికల బరిలో రాములమ్మ ఉందంటూ ప్రచారం ఊపందుకుంది. మాజీ మంత్రి ముఖ్యం రెడ్డి కాంగ్రెస్ ని వీడిన నాటి నుంచి అక్కడ సరైన న్యాయకత్వం లేదు.

ఒక్క బీజేపీ రఘునందన్ రావు మినహా అక్కడ పెద్ద నేతలు ఎవరూ లేరు. ఇటీవల మరణించిన ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కుటుంబం పట్ల టీఆర్ఎస్ లో అసంతృప్తి ఉంది. దీంతో.. దీనిని అవకాశంగా చేసుకొని.. ఎన్నికల బరిలో నివాలని విజయశాంతి భావిస్తున్నట్లు తెలుస్తోంది.

నిజానికి మెదక్ ఎంపీగా ఆమెకు ఉమ్మడి మెదక్ జిల్లాపై మంచి పట్టుంది. నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాల్లో వ్యక్తిగతంగా పరిచయాలు ఉన్నాయి. పార్టీలకతీతంగా అన్ని పార్టీలతో ఆమెకు సంబంధాలున్నాయి. 

ఇదిలా ఉండగా.. దుబ్బాక నియోజకవర్గం పూర్తిగా గ్రామీణ ప్రాంతం. అక్కడ కాంగ్రెస్ కు సహజంగానే ఓటు బ్యాంకింగ్ ఎక్కువ. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కి సరైన అభ్యర్థి లేకపోయినా... ఓటు బ్యాంకింగ్ లో రెండో స్థానంలో నిలిచింది. దీంతో.. ఇప్పుడు కనుక విజయశాంతి లాంటి క్యాండిడేట్ ని రంగంలోకి దింపితే.. సీటు పూర్తిగా మారిపోయి కాంగ్రెస్ కి ప్లస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారట.