హైదరాబాద్‌: ఇంటర్ ఫలితాల అవకతవకల వ్యవహారం రోజురోజుకు ఉధృతమవుతోంది. ఇంటర్ ఫలితాల అవకతవకలకు ప్రభుత్వమే కారణమని ఏఐసీసీ కార్యదర్శి, మాజీఎంపీ వీహెచ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై నిప్పులు చెరిగారు. 

ఇంటర్ పరీక్షల నిర్వహణ సంస్థ అయిన గ్లోబరీనా ఐటీ కంపెనీ తనకు తెలియదని కేటీఆర్‌ చెప్పడం అబద్ధమని విమర్శించారు. గ్లోబరీనా కంపెనీ తెలియదని అమ్మవారి మీద ప్రమాణం చేస్తావా అని కేటీఆర్‌కు సవాలు విసిరారు వీహెచ్. 

గ్లోబరీనా కంపెనీ తెలియకపోతే కేటీఆర్‌ మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు పెద్దమ్మ గుడి వద్దకు రావాలని చెప్పారు. పెద్దమ్మ గుడి దగ్గరకు రాకపోతే గ్లోబరీనా ఐటీ కంపెనీతో ఆయనకు సంబంధం ఉన్న మాట నిజమని అప్పుడైనా తెలుస్తుందన్నారు. ఐదేళ్లు ఐటీ మంత్రిగా ఉన్న కేటీఆర్‌కు ఐటీ కంపెనీ గురించి తెలియదా అని వీహెచ్ నిలదీశారు.