బిజెపి అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఘాటుగా స్పందించారు.
హైదరాబాద్ : తెలంగాణలో అమలు చేస్తున్న ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తామన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ స్పందించారు. దేశంలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా బిజెపి రాజ్యాంగ అమలవుతోందని అన్నారు.అయినప్పటికీ తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు తొలగించడం అమిత్ షా తరం కాదన్నారు. అసలు బిజెపి తెలంగాణలో అధికారంలోకి రావడమే అసాధ్యమని షబ్బీర్ అలీ పేర్కొన్నారు.
మతాల మధ్చ చిచ్చుపెడుతూ రాజకీయాలు చేయడం బిజెపికి ముందునుండి అలవాటేనని షబ్బీర్ ఎద్దేవా చేసారు. తెలంగాణ గడ్డపై మరోసారి ముస్లిం లపై విషం చిమ్ముతూ రిజర్వేషన్లను తొలగిస్తామన్న అమిత్ షాపై రాజ్యాంగపరమైన చర్యలు తీసుకోవాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేసారు.
Read More మజ్లిస్‌కు భయపడేది లేదు.. తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తాం : అమిత్ షా సంచలన ప్రకటన
ఇక అమిత్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క స్పందించారు. దేశ హోమంత్రి హోదాలో వున్న వ్యక్తి బాధ్యతాయుతంగా మాట్లాడకుండా మతాల మధ్య చిచ్చుపెట్టడం దారుణమని అన్నారు. అధికారంలో వున్నవారే మత రాజకీయాలు చేస్తే దేశాన్ని కాపాడేదెవరు? అని భట్టి విక్రమార్క నిలదీసారు.
అమిత్ షా ఏమన్నారంటే:
హైదరాబాద్ శివారులోని చేవెళ్లలో తెలంగాణ బిజెపి నిర్వహించిన పార్లమెంట్ ప్రవాస్ యోజన సభలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బిఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు ఒక్కటేనని అన్నారు. బిఆర్ఎస్ కారు స్టీరింగ్ మజ్లిస్ చేతుల్లో వుందని... ఒవైసీ ఎజెండానే కేసీఆర్ అమలు చేస్తున్నారని అన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తూ తెలంగాణ ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్లను అమలు చేస్తోందని అన్నారు. తెలంగాణలో బిజెపి అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లు తొలగించి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తామని అమిత్ ప్రకటించారు.
కేంద్ర హోంమంత్రి ప్రకటన తెలంగాణ రాజకీయాలను మరింత హీటెక్కించింది. బిజెపి మతరాజకీయాలు తెలంగాణలో సాగవని... అన్నదమ్ముల్లా వుండే హిందూ ముస్లీంల మధ్య అమిత్ షా చిచ్చు పెడుతున్నారని బిఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అమిత్ షా వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని వివిధ పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
