బీజేపీ అధికారంలోకి రాగానే తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమన్నారు. 

బీజేపీ అధికారంలోకి రాగానే తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. చేవేళ్లలో జరిగిన బీజేపీ పార్లమెంట్ ప్రవాస్ యోజన సభలో ఆయన మాట్లాడుతూ.. కారు స్టీరింగ్ మజ్లిస్ చేతుల్లో వుందని ఆరోపించారు. ఒవైసీ అజెండానే కేసీఆర్ అమలు చేస్తున్నారని.. ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు ఎత్తివేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తామని అమిత్ తెలిపారు. 

తెలంగాణలో హైవేల కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నామని.. కేంద్ర పథకాలను రాష్ట్రం సరిగా అమలు చేయడం లేదన్నారు. కేంద్రం అందించే వేల కోట్లు ప్రజలకు అందుతున్నాయా అని అమిత్ షా ప్రశ్నించారు. మూడేళ్లలో నాబార్దు ద్వారా రూ.60 కోట్లు అందించామని.. రామగుండం విద్యుత్ కేంద్రం కోసం నిధులు ఇచ్చామని ఆయన తెలిపారు. అలాగే సికింద్రాబాద్ స్టేషన్ ఆధునికీకరణకు , ఎంఎంటీఎస్ విస్తరణకు నిధులిచ్చామని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించాలని అమిత్ షా కోరారు. 

బండి సంజయ్‌ను కేసీఆర్‌ జైల్లో వేయించారని మండిపడ్డారు అమిత్ షా. జైళ్లకు వెళ్లేందుకు బీజేపీ కార్యకర్తలు భయపడరని స్పష్టం చేశారు. కేసీఆర్‌ను గద్దెదించే వరకూ బీజేపీ కార్యకర్తలు విక్రమించరని అమిత్ షా అన్నారు. 24 గంటల్లోనే బండి సంజయ్‌కు బెయిల్ వచ్చిందని.. తమ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను అసెంబ్లీకి వెళ్లకుండా చేయాలనుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం అందించే పథకాలు తెలంగాణలో క్షేత్రస్థాయికి చేరడం లేదని అమిత్ షా ఆరోపించారు. మోడీని ప్రజల నుంచి కేసీఆర్ దూరం చేయలేరని.. తెలంగాణలో పదో తరగతి పేపర్లు, టీఎస్‌పీఎస్సీ పేపర్లు లీక్ అవుతున్నాయని అమిత్ షా ఎద్దేవా చేశారు. 

యువత జీవితంలో కేసీఆర్ ఆటలాడుతున్నారని.. లీకేజ్‌లతో నిరుద్యోగుల జీవితాలను అంధకారంలోకి నెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ లీకేజీల ప్రభుత్వానికి కొనసాగే అర్హత వుందా అని అమిత్ షా ప్రశ్నించారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్‌పై కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆయన దుయ్యబట్టారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్‌పై సిట్టంగ్ జడ్జితో విచారణ చేయించాలని అమిత్ షా డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే దొంగలను జైళ్లో వేస్తామన్నారు. పేపర్ లీకేజ్‌పై ప్రశ్నించారని బండి సంజయ్‌ను జైళ్లో పెట్టారని.. బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ దేశమంతా విస్తరించాలనుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు. 

ఇక్కడి ముఖ్యమంత్రి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని.. ప్రధాని కావాలని కలలు కంటున్నారని అమిత్ షా అన్నారు. కేసీఆర్.. ప్రధాని సీటు ఖాళీగా లేదని, వచ్చే ఎన్నికల తర్వాత కూడా మోడీనే ప్రధాని అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ముందు సీఎం సీటు కాపాడుకుంటే చాలని అమిత్ షా చురకలంటించారు. కనీసం తెలంగాణ విమోచన దినం కూడా నిర్వహించడం లేదని.. బీజేపీ అధికారంలోకి రాగానే విమోచన దినాన్ని ఘనంగా నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. మజ్లిస్‌కు బీజేపీ భయపడేది లేదన్నారు.