దళిత బంధు చాలా గొప్ప పథకమని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ప్రశంసించారు.  దళిత బంధు విషయంలో విపక్షాలు రాజకీయాలు మానుకోవాలని సత్యనారాయణ సూచించారు. తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని, పార్టీ మారే ఆలోచన లేదని సర్వే సత్యనారాయణ స్పష్టం చేశారు. 

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. దళిత బంధు చాలా గొప్ప పథకమని ఆయన ప్రశంసించారు. దళితులు బాగుపడటానికి మంచి పథకం తీసుకొచ్చారని సర్వే కొనియాడారు. ఎవరికీ రాని ఆలోచన సీఎం కేసీఆర్‌కు వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. దళిత బంధు విషయంలో విపక్షాలు రాజకీయాలు మానుకోవాలని సత్యనారాయణ సూచించారు. తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని, పార్టీ మారే ఆలోచన లేదని సర్వే సత్యనారాయణ స్పష్టం చేశారు. 

కాగా, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు సైతం దళిత బంధు పథకాన్ని ప్రశంసించారు. ఈ పథకాన్ని అమలుచేసి ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. భారతదేశంలో అతి పెద్ద నిర్ణయం తీసుకున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని మోత్కుపల్లి కొనియాడారు. 

Also Read:దళిత బంధు కార్యక్రమం కాదు... ఓ ఉద్యమం: సీఎం కేసీఆర్

''ఇంతకాలం అన్ని పార్టీలు దళితులను దళితులుగానే చూశారు. కానీ నేరుగా దళితుల ఖాతాల్లో పది లక్షల రూపాయలు వేయడం ఎక్కడా చూడలేదు. రాష్ట్రంలోని దళిత కుటుంబాలన్నింటికి దళిత బంధు ఇస్తారనడానికి వాసాలమర్రె నిదర్శనం'' అన్నారు. ''తెలంగాణలో ప్రతిపక్షంలో వున్న పార్టీలవారు తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో దళిత బంధు అమలు చేసే ధైర్యం ఉందా? దళిత బంధు దేశం మొత్తం అమలు చేసే విధంగా జాతీయ పార్టీలు తమ అధిష్ఠానాలను ఒప్పించాలి'' అని మోత్కుపల్లి డిమాండ్ చేశారు.