బండి సంజయ్ ను స్పాన్సర్ చేస్తున్నదే కేసీఆర్... ఖర్చంతా గంగులదే : పొన్నం ప్రభాకర్ సంచలనం (వీడియో)
తెెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరే రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కు ఆర్థికసాయం చేస్తున్నాడని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
కరీంనగర్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే బిఆర్ఎస్ అభ్యర్థులనే కాదు కాంగ్రెస్ అభ్యర్థులను కూడా నిర్ణయించేది కేసీఆరే అంటూ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇప్పటికే 30 మంది కాంగ్రెస్ అభ్యర్థులను కేసీఆర్ ఖరారు చేసారని... బిఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేన్న సంజయ్ కు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు తర్వాత తెలంగాణలోనూ ఇదే పరిస్థితి వుంటుందని సంజయ్ కు అర్థమయ్యిందని... ఇది జీర్ణించుకోలేకే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడని పొన్నం అన్నారు.
డిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పాత్ర కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితదే అని తేలినా అరెస్ట్ చేయడంలేదు... బిజెపి, బిఆర్ఎస్ ఒక్కటేనని అర్థమవడానికి ఇది చాలని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. బండి జోకర్ లా మాట్లాడటం ఆపి అసలు కవిత ఎందుకు అరెస్ట్ చేయడంలేదో సూటిగా సుత్తి,నత్తి లేకుండా చెప్పాలని ఎద్దేవా చేసారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న కేసీఆర్ కోసం జైల్లో గదిని సిద్దం చేస్తున్నామని అన్నావుగా... ఏమయ్యింది? అంటూ సంజయ్ ని మాజీ ఎంపీ ప్రశ్నించారు.
బండి సంజయ్, గంగుల కమలాకర్ కలిసి పనిచేస్తున్నారని... ఒకరికి ఒకరు సహకరించుకుంటున్నారని కరీంనగర్ ప్రజలు కోడై కూస్తున్నారని పొన్నం పేర్కొన్నారు. సంజయ్ పాదయాత్రకు ఫైనాన్స్ చేసిందే కేసీఆర్... మంత్రి గంగుల ద్వారా ఈ ఖర్చంతా భరిస్తున్నాడని ఆరోపించారు. బిజెపి అధికారంలోకి వచ్చినా కేసీఆర్ పథకాలను కొనసాగిస్తామని బండి సంజయ్ అనడమే వారి మైత్రికి నిదర్శనమని బండి పొన్నం ప్రభాకర్ అన్నారు.
Read More కాంగ్రెస్ అభ్యర్థులను డిసైడ్ చేసేది కేసీఆరే.. ఆల్రెడీ 30 మంది లిస్ట్ ఖరారు: బండి సంజయ్
బిఆర్ఎస్, బిజెపి చీకటి స్నేహం ఎక్కడ బయటపడుతుందోననే కాంగ్రెస్ పై దుష్ప్రచారం చేస్తున్నారని పొన్నం అన్నారు. కేసీఆర్ తో కాంగ్రెస్ నేతలు టచ్ లో వున్నారని... 30మంది కాంగ్రెస్ అభ్యర్థులను కేసీఆర్ ఖరారు చేసారంటూ సంజయ్ వ్యాఖ్యలు ఇందులో భాగమేనని అన్నారు. హేతుబద్దత లేకుండా కేవలం సంచలనాల కోసమే మాట్లాడతాడని... అతడికి మెదడు కరాబయ్యిందని మాజీ ఎంపీ మండిపడ్డారు.
వీడియో
బండి సంజయ్ ను ఈ స్థాయికి తీసుకువచ్చిందే కేసీఆర్ అని పొన్నం అన్నారు. అవసరం లేకున్నా అరెస్టులు చేస్తూ సంజయ్ కు కేసీఆర్ ప్రభుత్వం హైప్ ఇచ్చిందన్నారు. హుజురాబాద్ లో ఈటల రాజేందర్ గెలుపు తర్వాత ఎక్కడ అతడు బలపడతాడోనని భయపడ్డ కేసీఆర్ సంజయ్ ను లేపారన్నారు. మంత్రి గంగుల ద్వారా సంజయ్ కు ఆర్థిక సాయం చేస్తున్నదే కేసీఆర్ అంటూ పొన్నం సంచలన వ్యాఖ్యలు చేసారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రోజురోజుకు మరింత బలపడుతోందని... కాబట్టి పార్టీలోంచి బయటకు వెళ్లినవారు తిరిగి రావాలని పొన్నం కోరారు. పార్టీ కోసం తామంతా ఓ మెట్టు దిగడానికి సిద్దమేనని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తీరుతుందని... రాష్ట్రం ఇచ్చిన పార్టీగా మమ్మల్ని ప్రజలు ఆశీర్వదిస్తారని మాజీ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.