కాంగ్రెస్ అభ్యర్థులను డిసైడ్ చేసేది కేసీఆరే.. ఆల్రెడీ 30 మంది లిస్ట్ ఖరారు: బండి సంజయ్
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకటేనని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కర్ణాటకలో కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ ఆర్థిక సాయం చేసిందని ఆరోపణలు చేశారు.
కరీంనగర్: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకటేనని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కర్ణాటకలో కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ ఆర్థిక సాయం చేసిందని ఆరోపణలు చేశారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో మహాజన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా టిఫిన్ బైఠక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులపాలు చేశారని విమర్శించారు. కేసీఆర్ ఇచ్చిన హామీలెన్ని నెరవేర్చారని ప్రశ్నించారు. ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు.
తాము అధికారంలో వచ్చాక కేసీఆర్ సర్కార్‌లోని మంచి పథకాలు కొనసాగిస్తామని చెప్పారు. ధరణి మంచి పథకమే కానీ కేసీఆర్ కుటుంబానికి ఆసరాగా మారిందని విమర్వించారు. ధరణిలో మార్పులు చేసి కొనసాగిస్తామని అన్నారు. ప్రధాని మోదీ హైదరాబాద్‌కు వస్తే కేసీఆర్‌కు వణుకు పుడుతుందని అన్నారు. అభివృద్ధి నిధులపై సీఎం చర్చకు వస్తారా? అని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధిపై చర్చకు కిషన్‌రెడ్డి వస్తారని.. పరేడ్ గ్రౌండ్‌లో కేసీఆర్ చర్చకు సిద్ధమా? అని సవాలు విసిరారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులను డిసైడ్ చేసేది కేసీఆర్‌నేనని బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్రంలోని 30 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను కేసీఆర్ ఆల్రెడీ ఖరారు చేశారని చెప్పారు. భవిష్యత్తులో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయని సీనియర్ నేత జానారెడ్డినే చెప్పారని అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో గిరిజన మహిళ ద్రౌపది ముర్మును ఓడించడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ప్రయత్నించాయని విమర్శించారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన వారు బీఆర్ఎస్‌లో చేరతారని.. కానీ బీజేపీ నుంచి ఎవరూ బయటకు వెళ్లరని అన్నారు.
బీఆర్ఎస్‌తో కొట్లాడేది బీజేపీ మాత్రమేనని.. కాంగ్రెస్ కాదని అన్నారు. కాంగ్రెస్‌ను పైకి లేపే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ మహిళల దుస్తులపై కాకుండా ఉగ్రవాదులపై దృష్టి పెట్టాలని ఎద్దేవా చేశారు.