Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ పక్కన ఉన్నవాళ్లు ఎవరు?.. ప్రజాస్వామ్యం గురించి మీరు మాట్లాడుతున్నారా?: పొంగులేటి ఫైర్

తెలంగాణలో అధికార బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ పాలేరులో అనవసన విమర్శలు చేశారని మండిపడ్డారు.

congress leader ponguleti srinivasa reddy Slams KCR ksm
Author
First Published Oct 28, 2023, 4:00 PM IST

తెలంగాణలో అధికార బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ పాలేరులో అనవసన విమర్శలు చేశారని మండిపడ్డారు. తన పేరు ప్రస్తావించకుండా తనని టార్గెట్ చేసి మాట్లాడరని అన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు ఖమ్మంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యం,నోట్ల కట్టల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. కేసీఆర్ పక్కన కూర్చొన్నోళ్లు ఏ పార్టీ నుంచి గెలిచారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ కొనుగోలు చేశారని ఆరోపించారు. అలాంటి కేసీఆర్.. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారా? అని ప్రశ్నించారు. 

తాను కాంట్రాక్టులు చేసి, పైరవీలు చేసి డబ్బు సంపాదించానని కేసీఆర్ మాట్లాడరని.. తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తారా? అని ప్రశ్నించారు. తాను తడి బట్టలతో వస్తానని.. ఏ గుడికి ఎప్పుడు వస్తారో రండి అని సవాలు విసిరారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే దళిత బంధు కార్యక్రమానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారని విమర్శించారు. ఈటల రాజేందర్‌ను ఓడించేందుకు దళిత బంధు తీసుకొచ్చిన లాభం లేకుండా పోయిందని.. ప్రజలు బీఆర్ఎస్ చెంప చెల్లుమనిపించారని అన్నారు. నిన్నటి సభలో కేసీఆర్ తన పేరు చెప్పి ఉంటే.. తన సత్తా ఏమిటో తెలిసేదని అన్నారు. దమ్ముంటే పాలేరు నుంచి పోటీ చేయాలని సవాలు విసిరారు. 

కేసీఆర్ కుటుంబం అన్ని వేల కోట్ల డబ్బులు ఎక్కడి నుంచి సంపాదించారని ప్రశ్నించారు. తెలంగాణ ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుందని పొంగులేటి ఆరోపించారు. కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిందని.. అయితే మేడిగడ్డతో అసలు రంగు బయటపడిందని అన్నారు. ఇక, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదని పొంగులేటి జోస్యం చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios