లక్ష కూడా పట్టుకోలేకపోయారు .. నామినేషన్స్ రోజే ఐటీ రైడ్స్, నన్ను వేధించేందుకే : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఐటీ దాడులపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని.. ఇవాళ తాను నామినేషన్ వేస్తున్నానని తెలిసే ఐటీ దాడులు జరిగాయని ఆయన ఆరోపించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. కాంగ్రెస్ నేత, పాలేరు అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ దాడులు కలకలం రేపాయి. గురువారం ఉదయం 5 గంటల నుంచి నేటికి సోదాలు కొనసాగుతూనే వున్నాయి. విషయం తెలుసుకున్న నేతలు, కార్యకర్తలు పొంగులేటి నివాసానికి భారీగా చేరుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన అనుచరుడు ఉపేందర్ ఒంటిపై పెట్రోలో పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించాడు.
మరోవైపు.. ఐటీ దాడులపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని.. ఇవాళ తాను నామినేషన్ వేస్తున్నానని తెలిసే ఐటీ దాడులు జరిగాయని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లపైనే దాడులు ఎందుకు జరుగుతున్నాయని.. ఉద్దేశపూర్వకంగానే ఐటీ దాడులు చేయిస్తున్నారని శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టుకోలేకపోయారన్నట్లుగా లక్ష కూడా పట్టుకోలేదని పొంగులేటి వ్యాఖ్యానించారు.
ఇకపోతే.. ఉదయం నుంచి శ్రీనివాస్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, సిబ్బందిని ఐటీ అధికారులు విడి విడిగా ప్రశ్నించారు. బయటి వ్యక్తులెవరితోనూ వీరిని కలవనివ్వలేదు. అయితే తనపై ఐటీ దాడులు జరుగుతాయని శ్రీనివాస్ రెడ్డి ముందే చెప్పడం గమనార్హం.