20 రోజుల్లోనే స్వంత గూటికి: కాంగ్రెస్ కు షాకిచ్చిన రామ్మోహన్ గౌడ్, బీఆర్ఎస్‌లో చేరిక
బీఆర్ఎస్ లో కాంగ్రెస్ నేత రామ్మోహన్ గౌడ్ ఇవాళ చేరారు. ఎల్ బీ నగర్ కాంగ్రెస్ టిక్కెట్టును రామ్మోహన్ గౌడ్ ఆశించారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం మధు యాష్కీకే టిక్కెట్టు ఇచ్చింది. దరిమిలా రామ్మోహన్ గౌడ్ బీఆర్ఎస్ లో చేరారు.
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ గెలిచే అవకాశమే లేదని మంత్రి హరీష్ రావు చెప్పారు. ఏ సర్వేలు చూసినా బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని చెబుతున్నాయని ఆయన తెలిపారు.
ఎల్ బీ నగర్ కు చెందిన కాంగ్రెస్ నేత ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ బుధవారంనాడు బీఆర్ఎస్ లో చేరారు. గత నెల 12న రామ్మోహన్ గౌడ్ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. ఎల్ బీ నగర్ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగాలని రామ్మోహన్ గౌడ్ భావించారు. కానీ ఆయనకు కాంగ్రెస్ టిక్కెట్టు దక్కలేదు. దీంతో రామ్మోహన్ గౌడ్ అసంతృప్తితో ఉన్నారు.ఈ విషయాన్ని గమనించిన బీఆర్ఎస్ నాయకత్వం రామ్మోహన్ గౌడ్ ను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించింది.
ఇవాళ ఉదయం మంత్రి హరీష్ రావు ఎల్ బీ నగర్ లో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ నివాసానికి వెళ్లారు. రామ్మోహన్ గౌడ్ ను బీఆర్ఎస్ లో చేరాలని ఆహ్వానించారు. తన అనుచరులతో కలిసి రామ్మోహన్ గౌడ్ దంపతులు బీఆర్ఎస్ లో చేరారు.
also read:కాంగ్రెస్‌కు షాకివ్వనున్న రామ్మోహన్ గౌడ్: కాసేపట్లో హస్తం నేత ఇంటికి హరీష్ రావు
రామ్మోహన్ గౌడ్ కు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రామ్మోహన్ గౌడ్ పనిచేశారన్నారు. కష్టకాలంలో పార్టీ కోసం పని చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రెండు దఫాలు టిక్కెట్టు ఇచ్చిన స్వల్ప ఓట్ల తేడాతో ఎల్ బీ నగర్ నుండి రామ్మోహన్ గౌడ్ ఓటమి పాలయ్యారు. ఎల్ బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 11 కార్పోరేటర్లను గెలిపించిన ఘనత రామ్మోహన్ గౌడ్ దేనని ఆయన చెప్పారు. హైకమాండ్ ఢిల్లీలో ఉండే పార్టీ కావాలా, ప్రజల మధ్య ఉండే పార్టీ కావాలా ప్రజలు ఆలోచిస్తున్నారన్నారు.
సుమారు 20 రోజుల వ్యవధిలోనే రామ్మోహన్ గౌడ్ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరారు. ఎల్ బీ నగర్ అసెంబ్లీ నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేయాలని రామ్మోహన్ గౌడ్ భావించారు. అయితే కాంగ్రెస్ టిక్కెట్టు మాత్రం మధు యాష్కీకి దక్కింది. దీంతో రామ్మోహన్ గౌడ్ కాంగ్రెస్ ను వీడారు. 2014, 2018 ఎన్నికల్లో ఎల్ బీనగర్ అసెంబ్లీ స్థానం నుండి రామ్మోహన్ గౌడ్ బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఈ దఫా బీఆర్ఎస్ టిక్కెట్టు దక్కదని భావించిన రామ్మోహన్ గౌడ్ కాంగ్రెస్ లో చేరారు. అక్కడ కూడ టిక్కెట్టు దక్కకపోవడంతో తిరిగి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.