Asianet News TeluguAsianet News Telugu

ప్రాజెక్టుల్లో కేసీఆర్‌కు 6శాతం ముడుపులు, విచారణ: జైపాల్ సంచలనం

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే  కేసీఆర్  అవినీతిపై , ప్రభుత్వ నిర్వాకంపై  సమగ్రంగా దర్యాప్తు  చేయిస్తామని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్. జైపాల్ రెడ్డి ప్రకటించారు.  

Congress leader jaipal reddy sensational comments on KCR
Author
Hyderabad, First Published Oct 16, 2018, 11:07 AM IST

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే  కేసీఆర్  అవినీతిపై , ప్రభుత్వ నిర్వాకంపై  సమగ్రంగా దర్యాప్తు  చేయిస్తామని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్. జైపాల్ రెడ్డి ప్రకటించారు.  

సోమవారం నాడు ఆయన గాంధీభవన్‌లో  మీడియాతో మాట్లాడారు.  రాష్ట్రంలో వేల కోట్ల రూపాయాలతో చేపట్టిన ప్రధాన పథకాల్లో  కేసీఆర్ 6 శాతం చొప్పున ముడుపులు తీసుకొన్నారని  జైపాల్ రెడ్డి ఆరోపించారు. ఈ ఎన్నికల్లో  కేసీఆర్ అవినీతి, టీఆర్ఎస్ సర్కార్ లంచగొండితనంపై ప్రధానంగా  ప్రస్తావిస్తామని  ఆయన ప్రకటించారు.

కాళేశ్వరం, మిషన్ భగీరథ, పాలేరు, సీతారామచంద్ర ప్రాజెక్టు, డిండి తదితర ప్రాజెక్టులను కలిపి ఒకే సంస్థకు రూ.60,436 కోట్లకు అప్పగించారని జైపాల్ రెడ్డి చెప్పారు.  దేశంలో ఎక్కడా కూడ ఇలా జరగలేదన్నారు. ఇవి కాకుండా మరో సంస్థకు  రూ.17వేల కోట్ల విలువైన  ప్రాజెక్టుల పనులను అప్పగించినట్టు జైపాల్ రెడ్డి గుర్తు చేశారు. 

ఈ రెండు కంపెనీలకు అప్పగించిన  కాంట్రాక్టు పనులను  30 శాతానికి అదనంగా అంచనాలను రూపొందించారని జైపాల్ రెడ్డి ఆరోపించారు. ప్రాజెక్టుల అంచనా విలువ రూ.50వేల కోట్ల దాటదన్నారు. కానీ,  అదనంగా రూ.27వేల కోట్లతో అంచనాలను రూపొందించారన్నారు.  ఇంత చేసినా మిషన్ భగీరథ పనులు పూర్తి కాలేదన్నారు.

వాస్తవధర కంటే  30 శాతం ఎక్కువగా అంచనాలు రూపొందించారనే విషయాన్ని  నిరూపించేందుకు  తాను  సిద్దంగా ఉన్నానని జైపాల్ రెడ్డి ప్రకటించారు.  పెంచిన అంచనాల్లో నుండి కేసీఆర్ నేరుగా 6 శాతం ముడుపులుగా తీసుకొంటున్నారని ఆయన  ఆరోపించారు. ప్రాజెక్టుల అంచనాల పెంపుపై కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వద్ద కాంగ్రెస్ పార్టీ రూ.500 కోట్లు తీసుకొన్నట్టుగా ప్రచారం చేస్తున్నారని... కేసీఆర్  ప్రాజెక్టులు కట్టబెట్టిన కాంట్రాక్టు సంస్థలు ఆంధ్రావా... తెలంగాణావో చెప్పాలని జైపాల్ రెడ్డి  కోరారు.

Follow Us:
Download App:
  • android
  • ios