హైదరాబాద్: మనుషుల అక్రమ రవాణా కేసులో కాంగ్రెసు నేత, మాజీ శాసనసభ్యుడు జగ్గారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు 2004కు సంబంధించింది. తన కుటుంబ సభ్యుల పేర్లతో ముగ్గురిని అమెరికాకు తీసుకుని వెళ్లినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. 

రేపు జరగనున్న మైనారిటీల సభకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో హైదరాబాదు నార్త్ జోన్ పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. విప్ గా తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని మనుషులను అక్రమంగా రవాణా చేశారని జగ్గారెడ్డిపై కేసు నమోదైంది. 

2004లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నకిలీ డాక్యుమెంట్లను సమర్పించి.. భార్యాపిల్లలుగా పేర్కొంటూ మరో ముగ్గురు వ్యక్తులను అమెరికాకు తీసుకుని వెళ్లారని అభియోగాలున్నాయి. జగ్గారెడ్డి 2004లో తన అధికారిక లెటర్‌ ప్యాడ్‌పై ప్రాంతీయ పాస్‌పోర్టుఅధికారికి లేఖ రాశారని పోలీసులు చెబుతున్నారు.
 
తన భార్య నిర్మల, కూతురు జయలక్ష్మి, కుమారుడు భరత్‌సాయి రెడ్డిలకు వెంటనే పాస్‌పోర్టు ఇవ్వాలని ఆ లేఖలో కోరారని, అమెరికా వీసా తీసుకునేప్పుడు కూడా నకిలీ డాక్యుమెంట్లు సమర్పించారని చెప్పారు. వాటి సాయంతో ఇద్దరు మహిళలు, ఒక యువకుడిని ఆయన తనవెంట అమెరికా తీసుకెళ్లారని, కానీ, జగ్గారెడ్డి మాత్రమే భారత్‌కు తిరిగి వచ్చారని పోలీసులు చెప్పారు. 

2004లో జగ్గారెడ్డి కుమారుడు భరత్‌సాయి వయసు నాలుగేళ్లేనని, పాస్‌పోర్టు కోసం తప్పుడు విద్యార్హత డాక్యుమెంట్లు సమర్పించి, అతడి వయసును 17 సంవత్సరాలుగా పేర్కొన్నారని వెల్లడించారు. ఆయన కూతురు జయలక్ష్మి 1997లో జన్మించిందని, పాస్‌పోర్టులో మాత్రం 1987గా పేర్కొన్నారని  చెప్పారు.
 
జగ్గారెడ్డి తన భార్య నిర్మల వయసును కూడా తప్పుగా చూపించారని అన్నారు. ఎమ్మెల్యేగా, విప్‌గా ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, మానవ అక్రమ రవాణా చేశారని, తప్పుడు ధ్రువీకరణ పత్రాలను సమర్పించారని, ఈ మేరకు ఆధారాలను సంపాదించిన తర్వాతే అరెస్టు చేశామని పోలీసు అధికారులు అంటున్నారు. 
 
నకిలీ ధ్రువీకరణ పత్రాలు సమర్పించి పాస్‌ పోర్టులు తీసుకోవడమే కాకుండా వాటితో జగ్గారెడ్డి మానవ అక్రమ రవాణాకు పాల్పడ్డారనే విషయంపై సోమవారం ఉదయమే తమకు సమాచారం అందిందని చెప్పారు. దీంతో, వెంటనే పాస్‌పోర్ట్‌ కార్యాలయంలో 2004 నాటి డాక్యుమెంట్లు తనిఖీ చేశామని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అంటన్నారు. 


పక్కా ఆధారాలు సంపాదించిన తర్వాత పటాన్‌చెరు సమీపంలోని ముత్తంగి చౌరస్తా వద్ద ఆయనను అరెస్టు చేసినట్లు వివరించారు. జగ్గారెడ్డి తన వెంట అమెరికాకు తీసుకెళ్లిన ముగ్గురూ గుజరాత్‌కు చెందిన వ్యక్తులుగా ప్రాథమిక దర్యాప్తులో తేలిందని, దీనిపై విచారణ కొనసాగుతోందని తెలిపారు.

                     "

ఈ వార్తలు చదవండి

తప్పించుకునేందుకు జగ్గారెడ్డి ఎత్తు: సంగారెడ్డి బంద్ కు పిలుపు

మాకు పాస్‌పోర్టులే లేవు: జగ్గారెడ్డి భార్య నిర్మల