తప్పు చేస్తే చెప్పండి పార్టీ నుండి తప్పుకొంటానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి, హనుమంతరావు చెప్పారు.
హైదరాబాద్: తప్పు చేస్తే చెప్పండి పార్టీ నుండి తప్పుకొంటానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి, హనుమంతరావు చెప్పారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. గాంధీ భవన్ లో తనను ప్రెస్ మీట్ పెట్టొద్దన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయినా కూడ తాను గాంధీ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తానని ఆయన తేల్చి చెప్పారు. అందరూ మాట్లాడొచ్చు నాకు మాత్రం ఎందుకు అభ్యంతరమని ఆయన ప్రశ్నించారు.
ఇప్పటివరకు తనను తిట్టినవారు లేరన్నారు. కానీ తనకు ఫోన్ చేసి బూతులు తిడుతున్నారని చెప్పారు. ఇలాంటి ఘటనలను జానారెడ్డి ఒక్కరే ఖండించారని ఆయన గుర్తు చేశారు. తనకు పార్టీలో అవమానాలు ఎక్కువయ్యాయని వీహెచ్ చెప్పారు. ఇంత జరుగుతున్నా పార్టీ నాయకత్వం మాత్రం పట్టించుకోవడం లేదని చెప్పారు. మూడు నాలుగు పార్టీలు మారి కాంగ్రెస్ లో చేరినవారు ఫోన్లు చేసి తనను తిడుతున్నారన్నారు.
పార్టీలో కూడ తనను అవమానిస్తున్నారని హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. సోనియాగాందీ అపాయింట్ మెంట్ దక్కకుండా అడ్డుకొంటున్నారని ఆయన గతంలో ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని వివరించేందుకు తాను చాలా రోజుల నుండి ప్రయత్నాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయితే ఎవరినీ గాంధీ భవన్ కు రానివ్వడన్నారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ అయ్యాక జైలుకు పోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. పార్టీ జైలు చుట్టూ తిరగాలా అని అడిగారు. తాను రేవంత్ ను ఏ రోజూ కూడ తిట్టలేదన్నారు.
రేవంత్ పెద్ద నాయకుడు గ్రేటర్‌లో ఎన్ని కార్పోరేటర్లను గెలిపించాడని ఆయన ప్రశ్నించాడు. అసలు పార్టీలో క్రమశిక్షణ ఉందా? లేదా అని ఆయన అడిగారు. రేవంత్ మీద ఆరోపణలు ఉన్నాయని మాత్రమే తాను చెప్పానన్నారు.ఇవాళ నన్ను తిట్టారు, రేపు ఇంకొకరిని తిడుతారని విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. ఈ విషయమై పార్టీ నాయకులు ఎందుకు అడగడం లేదో చెప్పాలన్నారు. మా పార్టీలోనే కోవర్టులున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కోవర్టులు ఉన్నంత కాలం పార్టీ బాగుపడదని ఆయన తేల్చేశారు. ఈ విషయమై పార్టీ అధిష్టానానికి లేఖలు రాసి అలిసిపోయాయయన్నారు.
