హైదరాబాద్: తాను  కాంగ్రెస్ పార్టీ సెక్రటరీగా ఉన్న కాలంలో కేసీఆర్  తమ వద్ద కూలీ మనిషిగా పనిచేశాడని కాంగ్రెస్ పార్టీ  సీనియర్ నేత గులాం నబీ ఆజాద్  తీవ్రమైన విమర్శలు చేశారు. 

మంగళవారం నాడు ఆయన  గజ్వేల్‌లో కాంగ్రెస్  పార్టీ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పేరు చెప్పుకొని ఉత్త పుణ్యానికి కేసీఆర్ సీఎం అయ్యారని  ఆయన చెప్పారు.

డబ్బు సంపాదన కోసమే  టీఆర్ఎస్‌ అధికారంలోకి వచ్చిందని ఆజాద్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ పాత్ర ఏమి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఈ ఎన్నికల్లో మహాకూటమి 70 నుంచి 80 స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.కేసీఆర్‌ డబ్బు సంపాదించుకోవడం కోసమే అధికారంలోకి వచ్చారని, మహాకూటమి ప్రజలకు సేవచేసేందుకు అధికారంలోకి రాబోతుందని ఆయన అన్నారు. ప్రజల స్పందన చూస్తుంటే గజ్వేల్‌లో ప్రతాప్‌రెడ్డి విజయం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.

2004 ఎన్నికల సమయంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు కూటమిగా ఏర్పడి  పోటీ చేశాయి.  ఈ కూటమి ఆ ఎన్నికల్లో  భారీ విజయాన్ని సాధించింది.ఆ సమయంలో ఉమ్మడి ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీగా  గులాం నబీ ఆజాద్ ఉన్నారు. 

కూటమిలోని పార్టీల మధ్య పొత్తుల విషయంలో ఆజాద్ కీలక పాత్ర పోషించారు. మరోవైపు  కాంగ్రెస్ పార్టీలోని నేతల మధ్య  సమన్వయంలో కూడ ఆజాద్  కీలకంగా వవ్యవహరించారు.