టీఆర్ఎస్, బీజేపీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆయన ఎలిమినేషన్‌కు గురయ్యారు.

అనంతరం చిన్నారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్, బీజేపీలు అడ్డగోలుగా డబ్బులు పంచాయని ఆరోపించారు. ప్రస్తుత పరిస్ధితుల్లో డబ్బు లేనిదే ఎన్నికలను తట్టుకునే పరిస్ధితి లేదని ఆయన తేల్చిచెప్పారు. డిగ్రీ చదవని వాళ్లకు ఓటు హక్కు కల్పించారని.. తప్పుడు సర్టిఫికెట్లతో ఓట్లు నమోదు చేశారని చిన్నారెడ్డి ఆరోపించారు. 

పట్టభద్రులు సైతం టీఆర్ఎస్‌కు ఓట్లు అమ్ముకోవటం బాధ కలిగిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం డబ్బులు పంచలేకపోవటం వలనే తనకు ఓట్లు పడలేదని చిన్నారెడ్డి ఆరోపించారు.

Also Read:ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు : కాంగ్రెస్ అవుట్ !!

పలుకుబడి 32వేల ఓట్లకే పరిమితం అనుకుంటున్నానన్నారు. డబ్బు ఖర్చు చేయటంలో కేసీఆర్‌ను భవిష్యత్‌లో ఎవరు తట్టుకోలేరని ఆయన వ్యాఖ్యానించారు. నాగార్జునసాగర్‌లో జానారెడ్డి మాత్రమే టీఆర్ఎస్, సీఎం కేసీఆర్‌ను తట్టుకోగలరని చిన్నారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

తమ పార్టీ నాయకత్వం, రేవంత్ రెడ్డి శక్తికి మించి తనకు సహకరించారని ఆయన తెలిపారు. తాగుబోతులు, లంచగొండి రాష్ట్రంగా మార్చిన కేసీఆర్ నుంచి తెలంగాణను కాపాడుకోవాలని చిన్నారెడ్డి శ్రేణులకు పిలుపునిచ్చారు. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.