Asianet News TeluguAsianet News Telugu

టీ కాంగ్రెస్‌లో కమిటీల చిచ్చు.. అధికార ప్రతినిధి పదవికి బెల్లయ్య నాయక్ రాజీనామా

తెలంగాణ పీసీసీ కమిటీల మార్పు కాంగ్రెప్ పార్టీలో చిచ్చు రేపుతోంది. కమిటీల్లో తాము ఆశించిన పదవులు దక్కని వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

Congress Leader bellaiah naik resigned as pcc spokesperson
Author
First Published Dec 12, 2022, 1:24 PM IST

తెలంగాణ పీసీసీ కమిటీల మార్పు కాంగ్రెప్ పార్టీలో చిచ్చు రేపుతోంది. కమిటీల్లో తాము ఆశించిన పదవులు దక్కని వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో తన పేరు లేకపోవడంపై సీనియర్ నాయకురాలు కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పీఏసీలో తనంటే జూనియర్లకు స్థానం కల్పించారని.. ఇది తనను అవమానించడమే అని పేర్కొన్నారు. తాను సాధారణ కార్యకర్తగానే కాంగ్రెస్‌లో కొనసాగుతానని, వరంగల్ తూర్పు ప్రజలకు అందుబాటులో ఉంటూ తన భర్త కొండా మురళితో కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. తాజాగా తనకు కొత్త కమిటీల్లో చోటు దక్కకపోవడంపై టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే  టీపీసీసీ అధికార ప్రతినిధి పదవికి ఆయన రాజీనామా  చేశారు. తన రాజీనామా లేఖను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి పంపారు.

జాతీయ ఆదివాసీ కాంగ్రెస్ సెల్ వైస్ ఛైర్మన్‌గా ఉన్న తనకు పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో స్థానం ఎందుకు కల్పించరని బెల్లయ్య నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్టీ సామాజిక వర్గం నేతలపై కాంగ్రెస్ పార్టీలో చిన్న చూపు ఉందని ఆరోపించారు. గతంలోనూ పీఏసీలో కోదండరెడ్డికి, తనకు అవకాశం ఇస్తామని చెప్పి కేవలం ఆయనకే ఆహ్వానం పంపేవారని బెల్లయ్య నాయక్ అన్నారు. 

ఈ పరిణామాలు రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వానికి కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టాయి. నిన్న కొండా సురేఖ, నేడు బెల్లయ్య నాయక్ అసంతృప్తి వ్యక్తం చేయగా.. ఇంకా ఎందరూ నేతలు ఈ బాటలో నడుస్తారనే ఆందోళన పార్టీ నాయకత్వాన్ని వెంటాడుతుంది. మరి ఈ పరిణమాలపై రాష్ట్ర నాయకత్వం, కాంగ్రెస్ హైకమాండ్ ఏ విధంగా స్పందిస్తుందో వేచిచూడాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios