రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపోటములు ఇప్పటికే తేలిపోయినా రాజకీయ ఎత్తులు పైఎత్తుల వల్ల ఇంకా సస్పెన్ష్ కొనసాగుతోంది. పార్టీ ల నేతల మాటలు చూస్తే ఏ క్షణాన ఏమి జరుగుతుందో అన్న రీతిలో వాతావరణం వేడెక్కుతోంది. టిఆర్ఎస్ ఆపరేసన్ ఆకర్ష్ దెబ్బకు చిగురుటాకులా వణికిపోయి విలవిలలాడిన తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే తేరుకుని రివర్స్ గేమ్ మొదలు పెట్టింది. దీంతో అధికార టిఆర్ఎస్ పార్టీ అలర్ట్ అవుతోంది.

తెలంగాణలో టిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి, టిడిపి, ఎంఐఎం, సిపిఎం పార్టీలకు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్లు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచినోళ్లలో అనేక మంది మీద ఆకర్ష్ మంత్రం పారడంతో టిఆర్ఎస్ గూటికి చేరారు. ఎమ్మెల్యేలు, ఎంపిలు కూడా ఉన్నారు. వారితోపాటు టిడిపి నుంచి చేరారు. వైసిపి దుకాణం మూసివేసి టిఆర్ఎస్ లో చేరారు. ఇక ఏకైక సిపిఐ ఎమ్మెల్యే కూడా టిఆర్ఎస్ గూటికి చేరారు.

ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి 13 మంది ఎమ్మెల్యేలు నలుగురు ఎంపిలు తెలంగాణ నుంచి ఉన్నారు. కానీ మీరా కుమార్ కు తెలంగాణ నుంచి 38 ప్రజాప్రతినిధులు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంతప్ కుమార్ బాంబు పేల్చారు. అంటే కాంగ్రెస్ బలం 17 మాత్రమే. వారికి సిపిఎం ఎమ్మెల్యే ఒకరు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. దీంతో వారి సంఖ్య 18కి చేరిందనుకున్నా మరి మిగతా 20 మందిని ఎక్కడినుంచి సంపాదించారన్నది చర్చనీయాంశమైంది. మరోవైపు ఆ 38 మందిలో అధికార పార్టీ వారే ఎక్కువగా ఉన్నారని కూడా సంపత్ ప్రకటించడం దుమారం రేపుతోంది.

ఇప్పుడున్న లెక్కల ప్రకారం టిఆర్ఎస్, బిజెపి, టిడిపి పార్టీలు ఎన్డీఏ కు మద్దతిస్తుండగా కాంగ్రెస్, సిపిఎం మాత్రం యుపిఎ అభ్యర్థికి మద్దతుగా ఉన్నాయి. ఇంకా ఎంఐఎం మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఒకవేళ ఎంఐఎం మద్దతిచ్చినా కాంగ్రెస్ మద్దతుదారుల సంఖ్య 26కు చేరుతుంది. అయినప్పటికీ అధికార పార్టీ నుంచి మరో 12 మందిని కాంగ్రెస్ గుంజుకొస్తదా అన్నది అనుమానంగానే ఉంది.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఆత్మప్రబోధానుసారం ఓటు వేసే వెసులుబాటు ఉంటుంది ఎమ్మెల్యేలకు. ఈ ఎన్నకల్లో విప్ వర్తించదు ఎవరికి ఓటేసినా వారిపై అనర్హత వేటు పడదు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికల కోసం ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ రివర్స్ గేమ్ షురూ చేసినట్లు కనిపిస్తోంది. సాధారణంగా అధికార పార్టీ నుంచి ఇలాంటి గేమ్స్ నడుస్తుంటాయి. ప్రతిపక్షాల సభ్యులు తమకు టచ్ లో ఉన్నారని, పార్టీ మారతారని అధికారంలో ఉన్నవారు అంటుంటారు. కానీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ రివర్స్ గేమ్ మొదలు పెట్టడం ఆసక్తిని రేపుతోంది.