Asianet News TeluguAsianet News Telugu

గద్వాల జేజమ్మకు షాక్

  • నాగం రాకను అడ్డుకునే యత్నం ఫెయిల్
  • అధిష్టానం వద్ద నుంచి నెగిటివ్ సిగ్నల్స్
  • పార్టీలోకి ఎవరొచ్చినా కలిసి పనిచేయాలని సూచన
  • టిడిపి వాళ్ల పెత్తనాన్ని అడ్డుకునే యత్నాలు విఫలం
congress high command shock to dk aruna on nagam joining issue

గద్వాల జేజమ్మగా పిలవబడుతున్న మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే డికె అరుణకు చేదు పరిణామం ఎదురైంది. అదికూడా తెలంగాణలో ఎదురే లేని కాంగ్రెస్ నేతల జాబితాలో ఉన్న డికె అరుణకు షాకింగ్ వార్త ఏందబ్బా అనుకుంటున్నారా? అయితే చదువురి.

తెలంగాణలో సీనియర్ నేతగా ఉన్న నాగం జనార్దన్ రెడ్డి బిజెపిలో ఇమడలేకపోతున్నారు. ఆయన ఎప్పుడెప్పుడు బిజెపి నుంచి బయటపడాలన్న ఉత్సుకతతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఎటు పోవాలన్నదానిపై బాగానే కసరత్తు చేశారు. అంతిమంగా ఆయన కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయమైందని ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే నాగం కాంగ్రెస్ నేతలతో ప్రాథమికంగా చర్చలు కూడా జరిపినట్లు వార్తలొస్తున్నాయి. ఆయన వచ్చే నెలలోనే బిజెపిని వీడి కాంగ్రెస్ లో చేరడం ఖాయంగా చెబుతున్నారు.

congress high command shock to dk aruna on nagam joining issue

ఈ పరిస్థితుల్లో నాగం జనార్దన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ లో చేర్చుకోరాదంటూ పాలమూరు నేతలు కొందరు కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదుల మోత మోగించారు. అలా ఫిర్యాదు చేసిన వారిలో డికె అరుణ, నాగర్ కర్నూలు కాంగ్రెస్ నేత ప్రస్తుతం ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ఉన్నట్లు చర్చ జరుగుతున్నది. వీరంతా ఏకంగా రాహుల్ గాంధీకే ఫిర్యాదులు చేసినట్లు చెబుతున్నారు. ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ఏకంగా రాహుల్‌‌ను కలిసి నాగం రాకను వ్యతిరేకిస్తూ కంప్లైంట్‌ చేశారు. ఇదే విషయంపై ఇప్పటికే కుంతియా, కొప్పుల రాజుకు కూడా ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ దామోదర్‌‌రెడ్డి బృందం ప్రచారం చేస్తోంది. 

అయితే ఈ విషయమై స్థానిక పరిస్థితులను పరిశీలించిన అధిష్టానం నాగం జనార్దన్ రెడ్డిని పార్టీలోకి తీసుకుంటున్నాం.. అందరూ కలిసి పనిచేయాల్సిందే అని తేల్చి చెప్పిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఎవరిని తీసుకోవాలో.. ఎవరిని తీసుకోవద్దో.. అధిష్టానమే చూసుకుంటుంది మీ జోక్యం అవసరం లేదని చెప్పినట్లు తెలిసింది. అంతేకాకుండా నాగర్ కర్నూలులో నాగం జనార్దన్ రెడ్డి మీద కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ఆరుసార్లు పోటీ చేసి ఓడిపోయిన చర్రిత ఉంది. ఈ పరిస్థితుల్లో ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన పదవీకాలం కూడా మరో మూడేళ్లు ఉంది కాబట్టి నాగం రాకను వ్యతిరేకించాల్సిన అవసరం లేదని అధిష్టానం తెగేసి చెప్పిందని ప్రచారం మొదలైంది.

మొత్తానికి నాగం జనార్దన్ రెడ్డి రాకను అడ్డుకునే ప్రయత్నం చేసిన డికె అరుణ వర్గానికి అధిష్టానం నుంచి సానుకూల సంకేతాలు అందలేదని పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మరోవైపు నాగం రాకను రేవంత్ రెడ్డి స్వాగతిస్తున్నారు. నాగం పార్టీలోకి రావడంలో రేవంత్ కీలక పాత్ర పోశిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నాగం, రేవంత్ ఇద్దరూ టిడిపి నుంచి వచ్చినందున.. రానున్న రోజుల్లో వీరు కాంగ్రెస్ పార్టీని కబ్జా చేస్తారన్న భయం సాంప్రదాయ కాంగ్రెస్ వర్గాల్లో ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే పెద్ద లీడర్ గా చెలామణి అయిన నాగం ను పార్టీలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు బలంగా చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి అధిష్టానం నుంచి క్లియర్ మెసేజ్ రావడంతో మరి రానున్న పరిణామాలు ఎలా ఉంటాయన్నది హాట్ టాపిక్ అయింది.

Follow Us:
Download App:
  • android
  • ios