కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు పిలుపు వచ్చింది. కొత్త పీసీసీ చీఫ్ నియామకం తర్వాత భట్టిని పిలవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రేవంత్ రెడ్డి నియామకం తర్వాత భట్టి సైలెంట్‌గా వుంటున్నారు

కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు పిలుపు వచ్చింది. కొత్త పీసీసీ చీఫ్ నియామకం తర్వాత భట్టిని పిలవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రేవంత్ రెడ్డి నియామకం తర్వాత భట్టి సైలెంట్‌గా వుంటున్నారు. కొత్త పీసీసీ చీఫ్‌పై అభిప్రాయం తెలుసుకునేందుకే భట్టికి పిలుపు వచ్చిందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పీసీసీ చీఫ్ నియామకంతో పాటు తెలంగాణ రాజకీయ పరిణామాలపై ఆయన అధిష్టానానికి వివరించే అవకాశాలు వున్నాయి. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఎంపికవ్వడాన్ని జీర్ణించుకోలేని పలువురు సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 

కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అది టీపీసీసీ కాదు.. టీడీపీ పీసీసీగా మారిపోయిందంటూ ఫైర్ అయ్యారు. ఇకపై తాను గాంధీ భవన్ మెట్లెక్కనని శపథం చేశారు. టీడీపీ నుంచి వచ్చిన నేతలు ఎవరూ తనను కలవొద్దని కోమటిరెడ్డి సూచించారు. తన రాజకీయ భవిష్యత్‌ను కార్యకర్తలే నిర్ణయిస్తారని వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ఇకపై తాను తన నియోజకవర్గం, జిల్లాకే పరిమితమవుతానని కోమటిరెడ్డి వెల్లడించారు.

Also Read:అది టీపీసీసీ కాదు.. టీడీపీపీసీసీ, ఇకపై గాంధీభవన్ మెట్లెక్కను: కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

సోనియా, రాహుల్ గాంధీలపై విమర్శలు చేయనని ఆయన స్పష్టం చేశారు. పీసీసీని ఇన్‌ఛార్జి అమ్ముకున్నారని.. త్వరలోనే ఆధారాలతో సహా బయటపెడతానని వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. పీసీసీ సామాన్య కార్యకర్తకు వస్తుందని అనుకున్నానన్నారు కోమటిరెడ్డి. తాను కార్యకర్త నుంచి వచ్చిన వాణ్ణి అని ఆయన తెలిపారు. ఈ నిర్ణయంతో కార్యకర్తలకు న్యాయం జరగదని కేడర్‌కి చెప్పినట్లయ్యిందని కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.