హైదరాబాద్: ఆదాయ పన్ను శాఖ  కాంగ్రెస్ పార్టీకి నోటీసులు జారీ చేసింది.  సుమారు  రూ. 170 కోట్లను కాంగ్రెస్ పార్టీకి హైద్రాబాద్‌కు చెందిన ఓ కంపెనీ నుండి కాంగ్రెస్ పార్టీ నిధులను పొందింది. అయితే హవాలా రాకెట్ కేసు విచారణలో భాగంగా ఈ విషయం వెలుగు చూసింది.ఈ విషయమై కాంగ్రెస్ పార్టీకి నోటీసులు జారీ చేశారు.

గత మాసంలో  జరిగిన  బహుళ దాడుల  నేపథ్యంలో  విచారణను మరింత ముమ్మరం చేసేందుకు వీలుగా  కాంగ్రెస్ పార్టీకి నోటీసులు జారీ చేసినట్టుగా  ఐటీ అధికారులు చెప్పారు.  ముంబై, ఢిల్లీ, హైద్రాబాద్‌ ప్రాంతాల్లో చేసిన సోదాల్లో ఈ విషయం వెలుగు చూసిందని ఐటీ అధికారులు చెబుతున్నారు.

 కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కొన్ని పార్టీల నేతలు నిఘాలో ఉన్నారని ఆదాయ పన్ను శాఖాధికారులు అభిప్రాయపడుతున్నారు. నవంబర్ మాసంలో పన్ను ఎగవేతదారులపై సోదాలు నిర్వహించినట్టుగా సీబీడిటీ , ఆదాయ పన్ను శాఖాధికారులు ఓ ప్రకటనలో ప్రకటించారు.

ఢిల్లీ, ముంబై, హైద్రాబాద్, ఈరోడ్ ,పూణే, ఆగ్రా, గోవా ప్రాంతాల్లో నకిలీ బిల్లులను సృష్టించి హవాలా మార్గంలో  డబ్బులను తరలిస్తున్నట్టుగా ఐటీ అధికారులు గుర్తించారు.ఈ మేరకు ఐటీ అధికారులు ఈ ప్రకటనలో వివరించారు.

ఈ సోదాల్లో కీలకమైన సమాచారాన్ని సేకరించినట్టుగా ఐటీ అధికారులు ప్రకటించారు. హవాలా రాకెట్‌కు సంబంధించిన కీలక పాత్రధారులను గుర్తించినట్టుగా ఆ ప్రకటనలో తెలిపారు.

అంతేకాదు రూ.3300 కోట్లను బోగస్ కాంట్రాక్టుల ద్వారా పొందినట్టుగా గుర్తించినట్టుగా సీబీడీటీ ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. మౌళిక సదుపాయాల సంస్థ, కార్పోరేట్ సంస్థల్లో చేసిన సోదాల్లో  కీలకమైన ఆధారాలను స్వాధీనం చేసుకొన్నట్టుగా ఆదాయ పన్ను  శాఖాధికారులు ప్రకటించారు.

పన్ను ఎగవేసిన కంపెనీలు ఎక్కువగా  ముంబైలో ఉన్నట్టుగా ఐటీ అధికారులు చెప్పారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓ ప్రముఖ వ్యక్తికి రూ. 150 కోట్లకు చెల్లింపులు చేసినట్టుగా  ఆధారాలు లభ్యమైనట్టుగా సీబీడీటీ అధికారులు ప్రకటించారు.