హైదరాబాద్ పాత బస్తీలో మకుటం లేని రాజకీయ పార్టీగా పేరుగాంచింది ఎంఐఎం పార్టీ. దశాబ్దాల కాలం పాతబస్తీని అడ్డాగా చేసుకుని ఆ పార్టీ తిరుగులేని శక్తిగా నిలిచింది. అయితే తెలంగాణ అంతగా, దేశమంతటా విస్తరించేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పెద్దగా ఫలించడంలేదు. కేవలం హైదరాబాద్ ఓల్డ్ సిటీలోనే గట్టి పట్టు కలిగి ఉంది.

అయితే ఉమ్మడి రాష్ట్రంలో కానీ.. తెలంగాణలో కానీ.. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో దోస్తాన్ చేయడం ఎంఐఎం కు అలవాటే అన్న విమర్శ కూడా ఉంది. అయితే ఎంఐఎం చరిత్రలో అతి ఎక్కువ కాలం కాంగ్రెస్ తోనే ఎంఐఎం దోస్తాన్ చేసింది. ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ కు మద్దతుగా ఎంఐఎం నడుస్తోంది. రానున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ తో లోపాయికారి దోస్తాన్ చేయవచ్చన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా అటు టిఆర్ఎస్ కు ఇటు ఎంఐఎం కు భారీ షాక్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది.

ఇవాళ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. రానున్న ఎన్నికల్లో ఎంఐఎం మీద అన్ని స్థానాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించిందని చెప్పారు. ఈ విషయంలో ఇప్పటికే కసరత్తు షురూ చేసినట్లు చెప్పారు. పాతబస్తీలో బలమైన అభ్యర్థులను బరిలోకి దించడం ద్వారా ఎంఐఎం కు అలాగే ఆ పార్టీతో అంటకాగుతున్న టిఆర్ఎస్ కు ఊహించని ఝలక్ ఇవ్వబోతున్నట్లు చెప్పుకొచ్చారు. అధికార పార్టీ వైఫల్యాలపై ఎంఐఎం ఏనాడూ పోరాటం చేసిన దాఖలాలు లేవన్నారు. టిఆర్ఎస్ తో అంటకాగుతున్న ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పడం ఒక్క కాంగ్రెస్ తోనే సాధ్యమని పేర్కొన్నారు.

నిజానికి కాంగ్రెస్ పార్టీ రానున్న 2019 ఎన్నికల్లో ఎలాగైనా ఎంఐఎం కు షాక్ ఇచ్చేందుకు భారీ స్కెచ్ వేసిందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఎంఐఎం పార్టీకి గట్టి ఫాలోయర్ గా ఉన్న మాజీ కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్ ఖాజా బిలాల్ అహ్మద్ ను కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంది. ఇటీవల ఎంఐఎం కు రాజీనామా చేసిన బిలాల్ కాంగ్రెస్ లో చేరారు. ఎంఐఎం కు రానున్న రోజుల్లో చుక్కలు చూపిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీ అంతటా బలమైన అభ్యర్థుల వేటలో కాంగ్రెస్ నిమగ్నమైందని పార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తానికి ఉత్తమ్ మాట నిజమే అయితే రానున్న రోజుల్లో ఎంఐఎం కు ఇబ్బందులు తప్పకపోవచ్చంటున్నారు.

ఒకవేళ ఎంఐఎం కూడా కౌంటర్ ఎటాక్ మొదలు పెడితే.. కాంగ్రెస్ కు హైదరాబాద్ మినహా మిగతా జిల్లాల్లో ఓటు బ్యాంకుగా ఉన్న సామాజికవర్గాన్ని కాంగ్రెస్ నుంచి దూరం చేసే పరిస్థితి ఉంటే కాంగ్రెస్ కే మరింత పెద్ద దెబ్బ తగిలే చాన్స్ కూడా లేకపోలేదంటున్నారు.