గాంధీ భవన్ ను ముట్టడించిన కాంట్రాక్టు లెక్చరర్లు
ఇలాంటి పరిస్థితి వస్తుందని కాంగ్రెస్ పార్టీ కూడా అస్సలు ఊహించి ఉండదు. ఎక్కడైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు, ఉద్యోగులు ఉద్యమిస్తుంటారు. కానీ, తెలంగాణ లో సీన్ రివర్స్ అయింది. తెలంగాణ ఇచ్చినా ఆ క్రెడిట్ దక్కకుండా ప్రతిపక్షానికి పరిమితమైన కాంగ్రెస్ కు ఈ రోజు ఊహించని షాక్ తగిలింది.
కాంట్రాక్టు లెక్చరర్లు తమ కుటుంబ సభ్యులతో కలిసి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీభవన్‌ను ముట్టడించారు.
తమ ఉద్యోగాలను క్రమబద్దీకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందని విమర్శించారు. కోర్టుల్లో కేసులు వేసి తమ పొట్టమీదకొడుతోందని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ కుతంత్రాలకు త్వరలోనే బుద్ది చెబుతామని హెచ్చరించారు. కాగా, కాంట్రాక్టు లెక్చరర్ల ముట్టడితో గాంధీ భవన్ పరిసర ప్రాంతాలు ఉద్రిక్తంగా మారాయి. పోలీసులు నినాదాలు చేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లను అక్కడి నుంచి తరలించారు.
మరోవైపు ఈ ఘటనపై కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ... టీఆర్ ఎస్ పన్నిన ఉచ్చులో కాంట్రాక్టు లెక్చరర్లు పడ్డారని, తాము వారి ఉద్యోగాల క్రమబద్దీకరణకు ఎప్పుడూ అడ్డు పడలేదని తెలిపారు.
టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి మాట్లాడుతూ... టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా వారి క్రమబద్దీకరణకు విధివిధానాలు ఖరారు చేయలేదని విమర్శించారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ అంశాన్ని తమ పారట్ మేనిఫెస్టోలో కూడా పెట్టినట్లు గుర్తు చేశారు.
ఇచ్చిన హామీ అమలను నిలబెట్టుకోలేని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని, సచివాలయాన్ని కాంట్రాక్టు లెక్చరర్లు ముట్టడించాలని సూచించారు. అంతేకాని ప్రతిపక్షంలో ఉన్న తమ పార్టీ కార్యాలయాన్ని కాదని స్పష్టం చేశారు.
