Asianet News TeluguAsianet News Telugu

అంజనీకుమార్ సహా అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న అధికారులను బదిలీ చేయాలి: కాంగ్రెస్ డిమాండ్


రిటైర్డ్ అధికారులతో పాటు,  బీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులపై  చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.ఈ మేరకు ఈసీకి ఫిర్యాదు చేసినట్టుగా కాంగ్రెస్ ప్రకటించింది

 Congress Demands take Action against officers Who Favour For BRS in Telangana Assembly Election lns
Author
First Published Oct 26, 2023, 11:47 AM IST

న్యూఢిల్లీ: ఎన్నికల నియామావళిని బీఆర్ఎస్ ఉల్లంఘిస్తుందని  కాంగ్రెస్ ఆరోపించింది.  ఈ విషయమై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టుగా  కాంగ్రెస్ నేతలు చెప్పారు.గురువారంనాడు  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,  మల్లు భట్టి విక్రమార్కలు  న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ కు మద్దతిస్తున్న అధికారులకు ఎన్నికల విధులు అప్పగించవద్దని  కోరినట్టుగా  మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి  చెప్పారు.ప్రభుత్వ పథకాల్లో  ఇచ్చే డబ్బు ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే ఇవ్వాలన్నారు.అధికారిక భవనాల్లో రాజకీయ కార్యకలాపాలు జరగకుండా చూడాలని ఈసీని కోరినట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి  చెప్పారు. 

కిషన్ రావు, ప్రభాకర్ రావు , జగన్మోహన్ రావు  వంటి  రిటైర్డ్ అధికారులను  విధుల నుండి తప్పించాలని  ఈసీని కోరినట్టుగా  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  చెప్పారు.ఈ మేరకు  తాము ఈసీకి  ఫిర్యాదు చేశామన్నారు. జయేష్ రంజన్ లాంటి అధికారులు బీఆర్ఎస్ కు ఎన్నికల నిధులు ఇవ్వాలని వ్యాపారులపై ఒత్తిడి తెస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. పార్టీ ఫండ్ ఇచ్చే కాంట్రాక్టర్లకే మాత్రమే నిధులు విడుదల చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రిటైర్డ్ అధికారులు ప్రైవేట్ ఆర్మీలా వ్యవహరిస్తున్నారన్నారు.సంక్షేమ పథకాలు ఆపేందుకు  కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని తమపై  బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తుందన్నారు.

తెలంగాణ డీజీపీ అంజనీకుమార్,మరో ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రను బదిలీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.   సీఎంలో పనిచేసే స్మితా సభర్వాల్,రాజశేఖర్ రెడ్డిలు బీఆర్ఎస్ కు అనుకూలంగా పనిచేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సంక్షేమ పథకాలకు సంబంధించిన నగదు బదిలీని ఈ ఏడాది నవంబర్ 2 లోపుగా పూర్తి చేయాలని ఈసీని కోరామన్నారు. నవంబర్ 3 నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నందున  అంతకుముందే  ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని కోరామన్నారు.
నిష్పక్షపాతంగా వ్యవహరించే అధికారులకు ఎన్నికల విధులు కేటాయించాలని రేవంత్ రెడ్డి  కోరారు. ప్రభుత్వ వేతనాలతో ప్రైవేట్ ఆర్మీని కేసీఆర్ నియమించుకున్నారని ఆయన విమర్శించారు. కొత్త ఆర్మీతో కాంగ్రెస్ నేతలపై కేసులు బనాయిస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఎన్నికల కారణంగా  ప్రస్తుతం ఏది వాయిదా పడినా  తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని చెల్లిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు సంఘవిద్రోహశక్తుల కుట్రగా దుష్ప్రచారం చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.ఒక తప్పును కప్పిపుచ్చుకొనేందుకు  మరో తప్పు చేస్తున్నారన్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు కారణాలు ఎందుకు బయటపెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు.ఈ బ్యారేజీ నిర్మించిన నిర్మాణ సంస్థపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మీనమేషాలు లెక్కపెడుతుందని ఆయన ప్రశ్నించారు.

Follow Us:
Download App:
  • android
  • ios