Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ ఎన్నికలు: ఆలస్యం అవుతున్న కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా.. కారణాలు ఇవే..!!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ రెండో జాబితా విడుదల ఆలస్యం అవుతుంది. పది రోజుల క్రితమే 55 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్.. రెండో జాబితాను ఇప్పటివరకు విడుదల చేయలేదు.

Congress Delayed Second List of candidates For Telangana Assembly Elections 2023 ksm
Author
First Published Oct 26, 2023, 10:08 AM IST | Last Updated Oct 26, 2023, 10:08 AM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ రెండో జాబితా విడుదల ఆలస్యం అవుతుంది. పది రోజుల క్రితమే 55 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్.. రెండో జాబితాను ఇప్పటివరకు విడుదల చేయలేదు. అసెంబ్లీ ఎన్నికలలో వామపక్ష పార్టీలతో పొత్తులో భాగంగా సీపీఐ, సీపీఎంలకు ఇచ్చిన నాలుగు స్థానాలను మినహాయించి కాంగ్రెస్ ఇంకా 60 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇందుకు సంబంధించి పార్టీ నేతలు తీవ్ర కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలోనే అభ్యర్థుల ఎంపికపై  బుధవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ సీఈసీ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియాగాంధీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఈసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అయితే ఈ సమావేశంలో 40-45 స్థానాలపై ఏకాభిప్రాయం కుదరగా.. 15-20 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. అనేక కారణాలతో ఆయా స్థానాల్లో అనిశ్చితి నెలకొందని సమాచారం. సర్వేలు అనుకూలంగా ఉన్న అభ్యర్థులకు పలు అంశాలు అడ్డంకిగా మారడం, పలు అంశాలు అనుకూలంగా ఉన్నవారికి సర్వేలు అనుకూలంగా లేకపోవడంతో పలు స్థానాల విషయంలో కాంగ్రెస్ సీఈసీ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.

అలాగే ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి కొందరు చేరతారనే లెక్కలు కూడా ఉండటంతో.. కొన్ని స్థానాల విషయంలో అభ్యర్థుల ఎంపికపై ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేకపోతుందని సమాచారం. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి గుడ్ బై చెప్పడంతో పాటు.. కాంగ్రెస్‌లో చేరనున్నట్టుగా ప్రకటించారు. ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ కప్పుకోనున్న రాజగోపాల్ రెడ్డికి మునుగోడు సీటు కేటాయించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. ఇదే బాటలో మరికొంతమంది సీనియర్ నేతలు చేరతారని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలోనే జాబితా విడుదలలో జాప్యం జరుగుతోంది.

మరోవైపు వామపక్షాలకు ఇచ్చే సీట్లపై అనిశ్చితి కూడా కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికకు సమస్యగా మారింది. సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు స్థానాల కేటాయింపుపై భిన్నాభిప్రాయాలు లేకపోయినా.. సీపీఎంకు ఇచ్చే సీట్ల విషయంలో మాత్రం ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం.

ఇక, మురళీధరన్ నేతృత్వంలోని ఏఐసీపీ స్క్రీనింగ్ కమిటీ బుధవారం అర్థరాత్రి ఢిల్లీలో ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో మరోసారి సమావేశమైంది. 15 నుంచి 20 సీట్లతో పాటు వామపక్షాలకు ఇచ్చే సీట్లపై కూడా వేణుగోపాల్ ఏకాభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక, స్క్రీనింగ్ కమిటీ సమర్పించిన జాబితాను పరిశీలించి ఆమోదం తెలిపేందుకు కాంగ్రెస్ సీఈసీ గురువారం మరోసారి సమావేశం కానుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios