తెలంగాణలో పార్టీ పరిస్థితిపై ఏఐసీసీ గత మూడు నెలల పాటు ప్రైవేట్ ఏజెన్సీతో సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని 50 సీట్లలో కాంగ్రెసు పార్టీకి మంచి అవకాశాలున్నట్లు సర్వేలో తేలింది.
హైదరాబాద్: వచ్చే శాసనసభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ను ఢీకొట్టేందుకు పకడ్బందీ వ్యూహరచన చేసి అమలు చేసేందుకు కాంగ్రెసు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. కాంగ్రెసు సీనియర్ నాయకుల మధ్య లుకలుకలు కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెసు నుంచి తప్పుకుంటానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇటీవల చెప్పారు. కొంత మంది సీనియర్ నాయకులు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీరుపై తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్ర నాయకుల మధ్య ఉన్న విభేదాలను రూపుమాపి తెలంగాణలో అత్యధిక సీట్లను సాధించే దిశగా కొనసాగాలని కాంగ్రెసు అధిష్టానం భావిస్తున్నట్లు చెబుతున్నారు.
తెలంగాణలో పార్టీని ముందుకు నడిపించేందుకు కాంగ్రెసు నాయకుడు రాహుల్ గాంధీ స్వయంగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ తీరుపై ఎఐసీసీ ఇటీవల సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, కనీసం 50 సీట్లలో కాంగ్రెసుకు మంచి అవకాశాలున్నాయని సర్వేలో తేలినట్లు చెబుతున్నారు. దాంతో 2023 శాసనసభ ఎన్నికల్లోనూ ఆ తర్వాత 2024లో జరిగే లోకసభ ఎన్నికల్లోనూ మంచి ఫలితాలు సాధించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో బిజెపి బలం పెరుగుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో దానికి తగిన బలం లేదని కాంగ్రెసు అంచనాకు వచ్చింది. తెలంగాణలోని మొత్తం 119 సీట్లలో పోటీకి దింపడానికి బిజెపికి సరైన అభ్యర్థులు కూడా లేరని ఎఐసీసీ అంచనాకు వచ్చినట్లు చెబుతున్నారు. గత మూడు నెలల కాలంలో ఐఐసీసీ తెలంగాణలోని 119 సీట్లలో ఓ ప్రైవేట్ ఏజెన్సీతో సర్వే చేయించింది.
సర్వే ఫలితాలను ఎఐసీసీ రాష్ట్ర నాయకులతో పంచుకోలేదు. అయితే, చూచాయగా పరిస్థితిని వివరించినట్లు సమాచారం. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో పార్టీ పనితీరు బాగుందని సర్వేలో తేలినట్లు సమాచారం. నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో టీఆర్ఎస్, కాంగ్రెసు మధ్య పోటాపోటీ ఉంటుందని సర్వేలో తేలింది.
ఇప్పటికే, కాంగ్రెసు పార్టీ తమ వ్యూహకర్తగా సునీల్ కనుకోలను ఎంపిక చేసుకుంది. ఆయన రాహుల్ గాంధీ నేతృత్వంలో పనిచేస్తారు. దక్షిణ భారతదేశంలో కాంగ్రెసు పరిస్థితిని మెరుగుపరచడానికి సునీల్ ను రాహుల్ గాంధీ ఎంపిక చేసుకున్నట్లు చెబుతున్నారు.
