ఈ నెల 16, 17 తేదీల్లో హైద్రాబాద్‌లో సీడబ్ల్యూసీ భేటీ: ఈ నెల 18న బీఆర్ఎస్ సర్కార్ పై చార్జీషీట్
ఈ నెల 16, 17 తేదీల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు హైద్రాబాద్ లో నిర్వహించనున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.
న్యూఢిల్లీ: ఈనెల 16, 17 తేదీల్లో హైద్రాబాద్ లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించనున్నట్టుగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఎఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇటీవలనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ప్రకటించారు. కొత్త వర్కింగ్ కమిటీ సభ్యుల తొలి సమావేశం హైద్రాబాద్ లో నిర్వహించనున్నట్టుగా కేసీ వేణుగోపాల్ చెప్పారు.
సోమవారంనాడు న్యూఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.ఈ నెల 16న సీడబ్ల్యూసీ ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసినట్టుగా చెప్పారు.ఈ నెల 17న 17న సీడబ్ల్యుసీ, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతల భేటీ జరగనుంది. అదే రోజున హైద్రాబాద్ లో మెగా ర్యాలీలు నిర్వహిస్తామని కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.అదే రోజున కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదు డిక్లరేషన్లను ప్రకటిస్తామని వేణుగో పాల్ తెలిపారు.
ఈ నెల 18న బీఆర్ఎస్ సర్కార్ పై చార్జీషీట్ విడుదల చేస్తామన్నారు.ఈ ఏడాది ఆగస్టు 20వ తేదీన సీడబ్ల్యూసీని ప్రకటించారు.39 మందికి సీడబ్ల్యూసీలో చోటు కల్పించారు.వీరిలో 32 మంది శాశ్వత ఆహ్వానితులు కాగా, 13 మంది ప్రత్యేక ఆహ్వానితులు ఉన్నారు. వీరిలో 15 మంది మహిళలకు స్థానం దక్కింది. ఈ ఏడాది చివరలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో హైద్రాబాద్ కేంద్రంగా సీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పట్టుదలతో ఉంది. దీంతో ఈ ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకొనేందుకు ఆ పార్టీ అన్ని రకాల వ్యూహలతో ముందుకు వెళ్తుంది. అభ్యర్థుల ఎంపికతో పాటు పార్టీ మేనిఫెస్టో విడుదలను ముందుగానే విడుదల చేయాలని ఆ పార్టీ భావిస్తుంది. అన్ని అనుకున్నట్టుగా సాగితే ఈ నెల రెండో వారంలో అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. అయితే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో అభ్యర్థుల ప్రకటన మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని సమాచారం.