Asianet News TeluguAsianet News Telugu

‘‘కేసిఆర్.. ప్రగతిభవన్ లో మూటాముల్లె సదురుకో’’

  • కేటీఆర్‌కు పగ్గాలిచ్చేందుకే కేసీఆర్‌ థర్డ్‌ఫ్రంట్‌ డ్రామా
  • నిన్నటి వరకూ బీజేపీతో బంధం.. నేడు వైరమా
  • ప్రజలకు కేసీఆర్‌ సంజాయిషీ ఇవ్వాలి
Congress asks KCR to pack up from Pragathi Bhavan

ప్రగతిభవన్ లో కేసిఆర్ మూటా ముల్లె సదురుకునే సమయం వచ్చిందని విమర్శించారు తెలంగాణ పిసిసి ప్రధాన అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్.  కేసీఆర్‌ తన కుమారుడు కల్వకుంట్ల తారక రామారావును (కేటీఆర్‌) రాజకీయ వారసుడిగా చేసేందుకు, సీఎంగా పట్టాభిషేకం చేసేందుకే థర్డ్‌ ఫ్రంట్‌ డ్రామాకు తెర లేపారని శ్రవణ్‌ ఆరోపించారు. కేటీఆర్‌కు పట్టాభిషేకం చేయడం ద్వారా వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా చేయాలనే ఎత్తుగడేలో భాగమే థర్డ్‌ఫ్రంట్‌ అని ఆయన విమర్శించారు.

బుధవారం గాంధీ భవన్‌లో దాసోజు శ్రవణ్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేయాలనే నిర్ణయం రాత్రికిరాత్రి తీసుకోవడం వెనుక కొడుకు కేటీఆర్‌ రాజకీయభవిష్యత్‌ ఒక్కటే ప్రధానమైనదని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల నుంచి కేసీఆర్‌ తప్పుకుని కేటీఆర్‌ను ప్రధాన నాయకుడిగా తెర మీదుకు తీసుకొస్తే.. నాలుగేళ్ల టీఆర్ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలన్నింటి నుంచి ప్రజల మనసుల్ని మళ్లించవచ్చునన్న వ్యూహంతోనే కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి చక్రం తిప్పుతానని అంటున్నారని శ్రవణ్‌ విమర్శించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్‌ గెలుపు ఊహించినదేనని, మళ్లీ ఆవిధమైన ఫలితాలు ఉండవని కేసీఆర్‌కు తెలుసున్నారు. అందుకే కుమారుడు కేటీఆర్‌కు నాయకత్వం ఇచ్చి తానేదో జాతీయ స్థాయిలోకి ఎదిగాడు అనే బ్రాంతి కల్పించి ప్రజలను మభ్య పెట్టి గెలిచేందుకు చేస్తున్న కుట్ర అన్నారు.

జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌కు ఉనికి ఉండబోదన్నారు. కనీసం ఎవ్వరూ గుర్తించే స్థాయిలో కూడా ఆయన రాజకీయ ఎత్తుగడలు లేవన్నారు.  నాలుగేళ్లుగా కేంద్రంలోని బీజేపీ సర్కార్‌కు వత్తాసుపలికి ఇప్పుడు ఒక్కసారిగా విమర్శలు చేస్తే మద్దతు ఇచ్చేయడానికి ప్రజలేమీ అమాయకులు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాల అడుగులకు మడుగులు ఒత్తిన కేసీఆర్‌ ఇప్పుడు వాళ్లని విమర్శిస్తే.. ఒక్కసారిగా కేసీఆర్‌ ఎందుకిలా మారారో ప్రజలు అంచనా వేయలేనంత అమాయకులు కాదని, ఈ నాటకానికి ప్రజలు తెర దించేస్తారనే ధీమాను శ్రవణ్‌ వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలకు జనంలో పెరుగుతున్న ఆదరణ, ప్రజా వ్యతిరేక నిర్ణయాల్ని ఎండగడుతున్న తీరుకు ప్రజల మద్దతు లభించడం చూసి కేసీఆర్‌ తన సొంత రాజకీయ భవిష్యత్‌ గురించి ఆలోచన చేసుకోవాల్సిన దుస్థితికి దిగజారారని శ్రవణ్‌ మండిపడ్డారు. తెర వెనుక బీజేపీ రచించిన వ్యూహాన్ని కేసీఆర్‌ తెర ముందు ఆడుతున్నారని, నిన్నటి వరకూ బీజేపీతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన కేసీఆర్‌ లాంటి నైతిక విలువలు లేని వారు ఇప్పుడు మాట మారిస్తే నమ్మేయడానికి జనమేమీ చెవుల్లో పువ్వులు పెట్టుకోలేదని ఆయన నిప్పులు చెరిగారు. బీజేపీ, మోదీ పాలనకు వ్యతిరేక ఓటు బ్యాంకును చీల్చడం ద్వారా తిరిగి బీజేపీకి మేలు జరిగేలా చేయడమే కేసీఆర్‌ ప్రధాన ఎజెండా అని శ్రవణ్‌ బల్లగుద్ది చెప్పారు.

పక్కాగా కెసిఆర్ తన   కుటుంబాన్ని, తన   ఆస్తులను, తమపై  ఉన్న  సిబిఐ కేసుల నుంచి తప్పించుకునేందుకు బిజెపితో లోపాయికారి, అండర్ స్టాండింగ్ రాజకీయాలు చేస్తుండ్రు. కెసిఆర్   చెబుతున్నట్టు బిజెపి, కేంద్రం గనుక రాష్ట్రాలకు అన్యాయం  చేసేది నిజం అయితే ఇప్పుడు పార్లమెంట్ లో అవిశ్వాస అంశం  మంచి ఆయుధం, కానీ అవిశ్వాసం చర్చకు రాకుండా తెరాస  పార్లమెంట్లో అడ్డుకుంటుంది. తెరాస ఎంపిలు  పార్లమెంట్లో రిజర్వేషన్ల అంశంపైన రభస చేస్తుండ్రు కానీ రిజర్వేషన్ల అంశంలో కూడా టిఆర్ ఎస్ కు చిత్తశుద్ది ఉంటే పార్లమెంట్లో అవిశ్వాస తీర్మాణానికి మద్దతు ఇవ్వడం ద్వారా చర్చకు పట్టుబట్టి చర్చలో రిజర్వేషన్ల అంశంతోపాటు కేంద్రం రాష్ట్రాలపై చేస్తున్న పెత్తనం, అన్యాయాలు, రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకు రావాల్సిన హక్కులు ఇలా అనేక అంశాలను చర్చించి ఒక ఫలవంతమైన రాజ్యంగ బద్దమైన పోరాటాలు చేసే అవకాశం ఉంది. అలా కాకుండా బిజెపికి లోపాయికారిగా మద్దతునిస్తూ మోడీ డైరెక్షన్లలో మీరు పనిచేస్తూ అవిశ్వాసం చర్చకు రాకుండా సహాకారం అందిస్తుండ్రు. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగకుండా మీరు చేస్తున్న డ్రామాపై మమతా బెనర్జీ మిమ్మల్ని కడిగి పారేసిందనే వార్తలు వస్తున్నాయి. 

టీఆర్ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ బహిరంగ లేఖ రాసినట్లు శ్రవణ్‌ తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలపై సీఎం కేసీఆర్‌ వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. విప్లవాత్మకమార్పులు కోరుకోవడం తప్పులేదని, అయితే ఆ మార్పులు దేశానికి ఉపయోగపడేలా ఉండాలని, అయితే కేసీఆర్‌ మాత్రం రాజ్యాంగాన్నే మార్చేస్తామన్నట్లుగా వ్యవహరించడం క్షమించరానిదన్నారు. కేసీఆర్‌ ఆలోచనలన్నీ దేశ సమగ్రత, సమైక్యతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని తప్పుపట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో 95 శాతం మంది తమ జనాభా నిష్పత్తికి అనుగుణంగా వనరులు, ఉపాధి వంటివి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్న తరుణంలో కేసీఆర్‌ థర్డ్‌ ఫ్రంట్‌ తెస్తున్నారని, సామాజిక గొంతును నొక్కేలా కేసీఆర్‌ ఎత్తుగడలు ఉన్నాయని శ్రవణ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 

థర్డ్‌ ఫ్రంట్‌ ద్వారా బీజేపీకి వ్యతిరేకమనే డ్రామాకు తెర లేపిన కేసీఆర్‌ గతాన్ని ఒక్కసారి పరిశీలిస్తే ఆయన నిజరూపం బట్టబయలు అవుతుందన్నారు. పెద్ద నోట్ల రద్దును బలపర్చిన తొలి ముఖ్యమంత్రి కేసీఆరేనని, జీఎస్‌టీ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం తెలిపేప్పుడు ప్రతిపక్ష కాంగ్రెస్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వని సీఎం కేసీఆరేనని, బీజేపీ తరఫున రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి అభ్యర్థులుగా పోటీ చేసిన వారికి మద్దతు ఇచ్చింది కేసీఆరేనని, బీజేపీతో పొత్తు లేకపోయినా మిత్రత్వంతో బేషరుతుగా మద్దతు ఇచ్చిందీ కేసీఆరేనని శ్రవణ్‌ గుర్తు చేశారు. ఇలాంటి చారిత్రక నిర్ణయాల్ని జనం మరిచిపోయి థర్డ్‌ఫ్రంట్‌కు మద్దతు ఇస్తారనే కేసీఆర్‌ పగటి కలలు కంటున్నారని శ్రవణ్  తీవ్రంగా విమర్శించారు. గత నిర్ణయాలకు వ్యతిరేకంగా థర్డ్‌ఫ్రంట్‌ ఏర్పాటు చేయడానికి కారణాల్ని కేసీఆర్‌ ప్రజలకు వివరించాలని, గతంలో మద్దతు ఇచ్చినందుకు ఇప్పుడు కేసీఆర్‌ ఏమనుకుంటున్నారో స్పష్టం చేయాలని, రహస్య ఒప్పందాలు ఏమిటో వెల్లడించాలని శ్రవణ్‌ డిమాండ్‌ చేశారు. 

తెలంగాణలో అనేక వాగ్దానాలు చేసిన కేసీఆర్‌ వాటిని అమలు చేయడంలో ఘోరంగా విఫలమ్యాయరని, అన్ని వర్గాల వారూ కేసీఆర్‌ పాలనలో మోసపోయారని, ఇదే తరహా ఎజెండాతో ఫెడరల్‌ ఫ్రంట్‌ ద్వారా జాతీయ స్థాయిలో ప్రజల్ని మోసం చేసేందుకు కంకణం కట్టుకున్నారని శ్రవణ్‌ అనుమానాన్ని వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల పెంపునకు హామీలు ఇచ్చే టీఆర్ఎస్‌ ముందుగా తమ పార్టీలో వివిధ పదవుల్ని ఆయా కులాల వారీగా ప్రధాన్యత ఇచ్చి నిజాయితీని చాటుకోవాలని శ్రవణ్‌ టీఆర్ఎస్‌ను డిమాండ్‌ చేశారు. పార్టీలోనే కాకుండా ప్రభుత్వంలోని వివిధ పదవులు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వారి వారి జనాభా నిష్పత్తి మేరకు పదువులు ఇచ్చి చిత్తశుద్ధిని చాటుకోవాలని కేసీఆర్‌ను డిమాండ్‌ చేశారు. ఇవన్నీ చేసేందుకు రాజ్యాంగపరంగా ఎలాంటి మార్పులు చేర్పులు అవసరం లేదని చట్టపరమైన వెసులుబాటు ఉన్న విషయాల్ని ఆయన వివరించారు. వచ్చే ఎన్నికల్లో ఆయా వర్గాల వారికి జ నాభా నిష్పత్తి ప్రకారం 95 శాతం వారికి సీట్లు ఇవ్వాలని శ్రవణ్‌ పట్టుబట్టారు. ఎస్టీలు, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని టీఆర్ఎస్‌ మోసం చేసిందని, వీటిని అమలు చేయాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపేస్తే సరిపోదని, ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు వాటిని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. గత నాలుగేళ్లుగా ఏమీ చేయకుండా మౌనంగా ఉండి ఇప్పుడు పార్లమెంటులో టీఆర్ఎస్‌ గొంతు విప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 

టీఆర్ఎస్‌ ప్రభుత్వం నాలుగేళ్లుగా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, కేసీఆర్‌ పాలనలో నాలుగువేల అయిదు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వారి కుటుంబాలకు ఒక్క పైసా చెల్లించలేదని, జీవో 421 ప్రకారం ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబానికి నాలుగు లక్షల రూపాయలు చెల్లించాలని, ఈ జీవోను కూడా అమలు చేయకుండా కేసీఆర్‌ రైతుల పట్ల నిర్ధాక్షణ్యంగా వ్యవహరించారని శ్రవణ్‌ నిప్పులు చెరిగారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలను కనీసం పరామర్శించలేదని, కేసీఆర్‌గానీ ఆయన మంత్రివర్గ సహచరులుగానీ పరామర్శించలేదంటే రైతుల పట్ల వారెంత కాఠిన్యంగా ఉన్నారో అర్ధం అవుతోందని విమర్శించారు. కేంద్రం నుంచి నిధులు తెప్పించుకోవడంలోగానీ, పనులు చేయించుకోవడంలోగానీ, ప్రాజెక్టులు మంజూరు చేయించుకోవడంలోగానీ టీఆర్ఎస్‌ ప్రభుత్వం ఘోరతిఘోరంగా వైఫల్యం చెందిందని శ్రవణ్‌ ధ్వజమెత్తారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం బయ్యారంలో స్టీల్‌ ప్లాంట్, ఎయిమ్స్, రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీలను తెలంగాణలో నెలకొల్పాలని, వాటి కోసం మోదీ సర్కార్‌పై ఏమాత్రం ఒత్తిడి పెట్టలేదంటే కే సీఆర్‌ రాష్ట్రం పట్ల ఎంత ఉదాశీనంగా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చునంటూ శ్రవణ్‌ నిప్పులు చెరిగారు.

తెలంగాణలో ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలు చేయడంలో టీఆర్ఎస్‌ ప్రభుత్వం వైఫల్యం చెందిందని, సబ్‌ప్లాన్‌కు ఏటా పది వేల కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి నాలుగేళ్లలో మొత్తం రూ,17,483 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, హామీ ఇచ్చిన నిధుల్లో ఇది కేవలం 40 శాతమేనన్నారు. పేదలకు 2,72,763 లక్షల రెండు పడక గదుల ఇండ్లను నిర్మిస్తామని హామీ ఇచ్చి 4,462 ఇండ్లను మాత్రమే పూర్తి చేశారని, పేదల ఇండ్లకు రూ.770 కోట్లను మాత్రమే బడ్జెట్‌లో కేటాయించారంటే టీఆర్ఎస్‌ ఇచ్చిన హామీ అమలు అవ్వదని స్పష్టం అవుతోందన్నారు. 
కేసీఆర్‌ పాలనలో పౌరహకుల్ని కాలరాస్తున్నారని, నిరసన తెలిపే ప్రాథమిక హక్కు అమలు కాకుండా ఎన్టీఆర్‌ స్టేడియం వద్ద ధర్నా చౌక్‌ను ఎత్తేశారని, హక్కుల గురించి ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని శ్రవణ్‌ విమర్శించారు. మహిళా సాధికారత గురించి ప్రపంచమంతా గొప్పగా చెబుతుంటే కేసీఆర్‌ మాత్రం తన క్యాబినెట్‌లో ఒక్క మహిళకు కూడా చోటు ఇవ్వలేదని తప్పుపట్టారు. 

టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ నిర్వహించిన ప్రజాబస్సు యాత్రకు జనం బ్రహరథం పట్టడంతో టీఆర్ఎస్‌ శ్రేణుల్లో భయం పట్టుకుందని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌ ఓటమి ఖాయమని కేసీఆర్‌కు అర్ధమయిందని, వచ్చే సారి టీఆర్ఎస్‌ తిరిగి అధికారంలోకి వస్తే తన పుత్రరత్నం కేటీఆర్‌ను సీఎంగా చూడాలనే కేసీఆర్‌ ఆశలు ఆవిరవుతున్నాయని, కేసీఆర్‌ కలలు కల్లలయ్యాయని, అందుకే థర్డ్‌ఫ్రంట్‌ డ్రామాకు తెరలేపారని శ్రవణ్‌ విమర్శించారు. ప్రగతి భవన్‌ నుంచి మూటాముళ్లు సర్ధుకునే సమయం కేసీఆర్‌ కుటుంబానికి రోజులు దగ్గర పడ్డాయని జోస్యం చెప్పారు. 

కేసీఆర్‌ థర్డ్‌ ఫ్రంట్‌కు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎక్కడా కూడా కనీస మద్దతు కూడబెట్టలేకపోయారని, మమతాబెనర్జీ, హేమంత్‌ సోరెన్‌లు మద్దతు ఇవ్వలేదని, ఇదే పరిస్థితి దేశంలోని ఇతర రాష్ట్రాలో ఉంటుందని శ్రవణ్‌ గట్టిగా చెప్పారు. బీజేపీకి మేలు జరిగేలా థర్డ్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తున్నారనే వాస్తవాన్ని ఇతర రాష్ట్రాల వారూ గుర్తించారని, కొల్‌కతాలో సీఎం మమతాబెనర్జీని కలుసుకునేందుకు కేసీఆర్‌ నానాతంటాలు పడ్డారని, పిలవని పేరంటానికి వెళ్లారని, రాజకీయ అవసరాల కోసం ప్రజాధనంతో ప్రత్యేక విమానం అక్కడికి కేసీఆర్‌ వెళ్లడాన్ని శ్రవణ్‌ తప్పుపట్టారు.

Follow Us:
Download App:
  • android
  • ios